
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ‍్యతిరేకిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అసదుద్దీన్ తీవ‍్రంగా వ‍్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ బిల్లు ప్రతులను కూడా ఆయన చింపివేశారు. లోక్‌సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒవైసీ.. ఈ బిల్లు ద్వారా దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సభలోనే బిల్లు పేపర్లు చింపివేసి.. ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.
కాగా పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అలాగే ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఇక ఈ బిల్లును సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు.
చదవండి: రణరంగంగా జామియా వర్సిటీ