న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. మొదట అల్లర్లు ఆగిపోయి.. శాంతి నెలకొల్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశంపై మంగళవారం వాదనలు వింటామని ఆయన స్పష్టం చేశారు. ‘మొదట అల్లర్లు ఆగాలని మేం కోరుకుంటున్నాం. అలర్లు ఎలా జరుగుతున్నాయో మాకు తెలుసు. ఇలాంటి వాతావరణంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ముందు ఇది ఆగాలి’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా జామియా, అలీగఢ్ యూనివర్సిటీల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కోలిన్ గోన్‌సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ఆ రెండు యూనివర్సిటీలకు పంపి.. విద్యార్థులపై జరిగిన హింస పట్ల దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ‘ఎందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు? బస్సులను తగులబెడుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అల్లర్లు చేస్తున్నవారు వెంటనే వాటిని ఆపాలి’ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment