న్యూఢిల్లీ: పార్కింగ్ విషయమై తలెత్తిన వివాదంలో ఓ ఎంపీ కొడుకుపై దాడి జరిగింది. ఈ ఘటన ఢిల్లీలోని సౌత్‌ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్‌లోని జహానాబాద్ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ తనయుడు రితురాజ్ వృత్తిరీత్యా న్యాయవాది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రితురాజ్ తన సోదరుడు రిషబ్‌తో కలసి ఇంటికి చేరుకున్నాడు. అయితే, ఇంటి గేట్ ముందు ఓ స్కూటీ పార్క్ చేసి ఉండడంతో దాన్ని తీయాలని యజమానిని కోరాడు.
స్కూటీ తీసిన తర్వాత ఆ స్థలంలో రితురాజ్ తన కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత రితురాజ్ బయటకు వచ్చి చూడగా మళ్లీ గేటు ముందు స్కూటీ పార్క్ చేసి ఉంది. దాన్ని తీయాలని మరోసారి కోరడంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత స్కూటీ యజమాని మరికొందరితో కలసి వచ్చి తనపై, తన సోదరుడిపై దాడికి పాల్పడినట్టు రితురాజ్ హౌజ్‌ఖాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.