
న్యూఢిల్లీ: ఆయుష్ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1626.37 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కన్నా 13 శాతం ఎక్కువ. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, పథకాలకయ్యే మొత్తం వ్యయాన్ని రూ.71.36 కోట్లుగా అంచనా వేశారు. గతేడాది బడ్జెట్‌లో ఇందుకోసం తొలుత రూ.68.86 కోట్లు కేటాయించి తరువాత రూ.87.64 కోట్లకు పెంచారు. నియంత్రణ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు ఈసారి కేటాయింపులు పెరిగాయి. చట్టబద్ధ, నియంత్రణ సంస్థలకు రూ.9.60 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థలకు రూ.906.70 కోట్లు కేటాయించారు. చట్టబద్ధ, నియంత్రణ సంస్థల కింద న్యూఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, స్వయంప్రతిపత్తి సంస్థల్లో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఉన్నాయి.