ఎస్పీ నేత ఆజం ఖాన్
రాంపూర్, ఉత్తరప్రదేశ్ : ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆవులకు దూరంగా ఉండాల్సిందేనంటూ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన మూక హత్యను ఉటంకిస్తూ.. ఎప్పుడైతే గోవధను పూర్తి స్థాయిలో నిషేధిస్తారో అప్పుడే మూకదాడులు, హత్యాకాండ, అనిశ్చితికి తావుండదంటూ ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆజం ఖాన్.. భవిష్యత్ తరాల బాగుకోసమైనా మనం(ముస్లింలు) ఆవులు, పాల వ్యాపారానికి దూరంగా ఉంటే మంచిదని వ్యాఖ్యానించారు.
‘గోమాతగా పిలుచుకునే ఆవులను తాకితే చాలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందంటూ కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆవులతో వ్యాపారం చేసిన వాళ్లని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు వాటికి దూరంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవడమే మంచిది కదా. భవిష్యత్ తరాలకు ఈ విషయం గురించి సవివరంగా చెప్పాల్సి ఉంటుందంటూ’ ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. కాగా ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాంల పై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Please login to add a commentAdd a comment