సీఎం యోగితో బాబారామ్‌దేవ్
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే భక్తులు ఓ శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం రామ భక్తులు మరెన్నో రోజులు ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నత విద్య ప్రమాణాలపై హరిద్వార్‌లో జరిగిన జ్ఞానకుంభ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈసారి దీపావళి వేడుకలను రాముడి జన్మ స్థలంలో జరుపుకునేందుకు దక్షిణ కొరియా నుంచి ఓ ఉన్నత స్థాయి బృందం వస్తోందని చెప్పారు.
జ్ఞానకుంభ్ కార్యక్రమంలోనే యోగా గురు బాబా రాందేవ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు రామ మందిర నిర్మాణానికి వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆలయ నిర్మాణాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని బీజేపీ నేతలైన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు వ్యాఖ్యానించారు. మరోవైపు రామాలయ నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 3 వేల మంది సాధువులు, సన్యాసులు ఢిల్లీలోని తాల్కటోరా మైదానంలో శని, ఆదివారాల్లో సమావేశమయ్యారు.
రామ మందిర నిర్మాణానికి ప్రభుత్వం కొత్త చట్టం లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని దేశంలో హిందూ సంస్థలకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారతీయ సంత్ సమితి డిమాండ్ చేసింది. మరో కేంద్ర మంత్రి ఉమాభారతి ఢిల్లీలో మాట్లాడుతూ ‘హిందువులు ప్రపంచంలోనే అత్యంత సహనపరులు. అయితే అయోధ్యలో రామాలయ పరిసరాల్లో మసీదును కూడా కట్టాలనే మాటలు హిందువులను అసహనానికి గురిచేస్తాయి’ అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తనతో కలిసి ఆలయానికి పునాది రాయి వేయాలని ఆమె ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment