మూడు గంటలు ప్రయాణించి వెనక్కి!
ఎయిర్ ఇండియా విమాన పైలట్ నిర్వాకం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి గంట ఆలస్యంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం మూడుగంటలపాటు ప్రయాణించిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఎయిరిండియా ప్రతినిధుల వివరాల ప్రకారం... ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ 121) శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు 200 మంది ప్రయాణికులతో షెడ్యూలు కంటే గంట ఆలస్యంగా ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరింది. తర్వాత మూడు గంటలపాటు గాలిలో ప్రయాణించిన తర్వాత మిగతా ప్రయాణ సమయంపై లెక్కలు వేసుకున్న పైలట్ కంగుతిన్నాడు. ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయానికి నైట్ కర్ఫ్యూ(రాత్రిపూట ప్రవేశం ఉండదు) సమయంలోగా చేరుకోవడం సాధ్యం కాదని, ఆ తర్వాత అక్కడికి చేరినా విమానాన్ని దింపడం కుదరని గ్రహించాడు.
అలాగే విమానం ఆలస్యం అయినందున ఒక పైలట్‌కు పరిమితి ఉన్న డ్యూటీ సమయం కూడా మించిపోతుందని గుర్తించాడు.ఇక చేసేదేమీ లేక విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించాడు. దీంతో అసలే ఆలస్యం.. ఆపై సగందూరం వెళ్లి వెనక్కి వచ్చేసరికి ప్రయాణికులంతా ఉసూరుమన్నారు. కాగా, ప్రయాణికులకు వసతి సౌకర్యాలు కల్పించామని, వారిని ఆదివారం ఉదయం మరో విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్‌కు పంపుతామని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.