
పాలికె, అసెంబ్లీ, లోక్‌సభ.. ఇలా ఏ ఎన్నికలు వచ్చినా ఉద్యాననగరిలో ఐటీ, బీటీ తదితర అనేక సంస్థల ఉద్యోగులకు సెలవే. అయితే అనేకమంది పోలింగ్ కేంద్రాలకు కాకుండా విహార యాత్రలకు వెళ్తున్నారని ఫిర్యాదులు రావడంతో కంపెనీలు నివారణ చర్యలు చేపట్టాయి.
బనశంకరి: రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకుండా సెలవును గడిపే ఐటీ కంపెనీ ఉద్యోగులను యాజమాన్యాలు కట్టడి చేయబోతున్నాయి. ఈ నెల 18 తేదీన బెంగళూరులో జరిగే పోలింగ్ రోజున కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుని, ఆ ఆధారాలను హెచ్‌ఆర్ విభాగంలో సమర్పించాలి. అప్పుడే వేతన సమేత సెలవు లభిస్తుంది. లేనిపక్షంలో ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశాయి.
ఎన్నికల సంఘం ఆదేశాలతో
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి పలు చర్యలు చేపడుతోంది. ప్రతి ఎన్నికల్లోనే విద్యావంత ఓటర్లు పోలింగ్ రోజున ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారని, గ్రామీణ ప్రదేశాల కంటే నగరాల్లో పోలింగ్‌శాతం తక్కువగా నమోదు కావడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నగరంలోని ఐటీ, బీటీ కంపెనీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులను ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు తప్పనిసరిగా ఓటు వేయాలని తమ ఉద్యోగులను ఆదేశించాయి.
వేతన సెలవు పక్కదారి
ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ సూచన మేరకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నారు. ఈ సెలవును ఉద్యోగులు విశ్రాంతికి, విహార యాత్రలకు మార్చుకుంటున్నారని ఆరోపణలున్నాయి. అంతే తప్ప బాధ్యతగా ఓటు వేయడం లేదు. దీనిని నివారించడానికి యజమాన్యాలు తమ ఉద్యోగులకు వేతన సమేతంగా సెలవు కావాలంటే ఓటింగ్‌లో పాల్గొన్నట్లు పూర్తి ఆధారాలు అందజేయాలి. లేని పక్షంలో ఆ రోజు సెలవు రద్దు చేస్తామని చెబుతున్నాయి. ఇన్పోసిస్ తో పాటు అనేక ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు సందేశం పంపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment