
భారత్‌లో బంగ్లా ప్రధాని
ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారత్ పర్యటనకు వస్తే ప్రొటోకాల్ మేరకు విదేశాంగ సహాయ మంత్రో, ఇతర సహాయ మంత్రులో అధికారికంగా స్వాగతం పలుకుతారు.
4 రోజుల పర్యటనకు వచ్చిన హసీనా
► ప్రొటోకాల్ పక్కనపెట్టి స్వాగతం పలికిన మోదీ
న్యూఢిల్లీ: ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారత్ పర్యటనకు వస్తే ప్రొటోకాల్ మేరకు విదేశాంగ సహాయ మంత్రో, ఇతర సహాయ మంత్రులో అధికారికంగా స్వాగతం పలుకుతారు. అందుకు భిన్నంగా ప్రధాని మోదీ దౌత్య సంప్రదాయాల్ని పక్కన పెట్టి శుక్రవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు స్వాగతం పలికారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో పర్యటిస్తున్న హసీనా శనివారం రాష్ట్రపతి భవన్ లో అధికారిక స్వాగతం అనంతరం ప్రధాని మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు సైనిక సాయంగా భారత్ రూ. 3250 కోట్ల సాయాన్ని ప్రకటించే అవకాశముంది. కీలకమైన పౌర అణు సహకారం, రక్షణ ఒప్పందాలు సహా దాదాపు 25 ద్వైపాక్షిక ఒప్పందాలపై భారత్, బంగ్లాదేశ్‌లు సంతకం చేయనున్నాయి. అయితే తీస్తా నదీ జలాల ఒప్పందంపై ఎలాంటి చర్చా ఉండకపోవచ్చని భారత్ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతను సంప్రదించకుండా ఈ అంశంలో కేంద్రం ముందుకెళ్లదని వారు తెలిపారు.
కొత్త ప్యాసింజర్ రైలుపై ప్రకటన
భారత్–బంగ్లాదేశ్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలు ప్రారంభంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను ఏసీ రైలుగా మార్చే ప్రతిపాదనపై మోదీ–హసీనా చర్చల్లో ప్రకటించనున్నారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కంపెనీ ఆఫ్ బంగ్లాదేశ్ మధ్య కంటైనర్ సర్వీసు నడిపేందుకు ఒప్పందం కుదిరేవీలుంది.
దాదాపు ఏడేళ్ల అనంతరం భారత్‌లో పర్యటిస్తున్న హసీనా రాష్ట్రపతి ప్రణబ్‌ను, సోనియాను కలవనున్నారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య పరస్పర సహకార భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు, దృఢమైన స్నేహ సంబంధాల స్థాపనకు పర్యటన సాయ పడుతుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.