
రావిమొక్క నాటిన అధ్యక్షుడు
రాజ్ఘాట్లో బాపూజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, అక్కడ ఓ రావిమొక్కను నాటారు. రాజ్ఘాట్ సందర్శనకు చిహ్నంగా ఈ మొక్కను నాటారు. సందర్శకుల పుస్తకంలో కూడా తన సందేశం రాశారు. అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, భారతదేశంలో మహాత్మా గాంధీ ఇద్దరూ శాంతియుత పద్ధతుల్లోనే పోరాటాలు చేశారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. బాపూజీ ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ భారత దేశంలో సజీవంగా ఉందని తెలిపారు.
అనంతరం హైదరాబాద్ హౌస్లో ఏర్పాటుచేసిన విందు సమావేశానికి ఒబామా హాజరయ్యారు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులూ కొద్దిసేపు మాట్లాడుకున్న అనంతరం.. లోపలకు వెళ్లారు. విందుతో పాటే ఇరువురు నాయకుల మధ్య పలు అంశాలపై చర్చలు కూడా సాగుతాయని అధికార వర్గాల సమాచారం.