హీరో నుంచి జీరో అయ్యాడు.. | Behind the mask of Hardik Patel | Sakshi
Sakshi News home page

హీరో నుంచి జీరో అయ్యాడు..

Published Fri, Sep 25 2015 3:17 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

హీరో నుంచి జీరో అయ్యాడు.. - Sakshi

హీరో నుంచి జీరో అయ్యాడు..

 గాంధీనగర్:  గుజరాత్‌లో హార్దిక్ పటేల్ నాయకత్వంలో ఉప్పెనలా ఉవ్వెత్తిన లేచిన పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం నెల రోజుల్లోనే ఎందుకు నీరు కారిపోయింది. ఒక్క పిలుపుతో ఒక్కసారిగా తరలి వచ్చిన ఐదు లక్షల మంది ప్రజలు నేడు ఏమయ్యారు. హార్దిక్ పటేల్ నేడు ఎక్కడికెళ్లినా ఆయన వెనక పాతిక మంది స్వకులస్థులు కూడా ఎందుకు పోగవడం లేదు. మూడు నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని 22 ఏళ్ల హార్దిక్ పటేల్ రెండు నెలల కాలంలోనే హీరో అయ్యారు. అలాంటి ఉచ్ఛస్థితి నుంచి నెల రోజుల్లోనే జీరో ఎందుకయ్యారు. హీరోగా ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిన సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోంది. ఆయన్ని హీరో చేసిన అదృశ్య శక్తులే ఇప్పుడు ఆయన్ని జీరో చేశాయా ?

ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు నేడు రాజకీయ పరిశీలకులకే కాకుండా సామాన్యులకు కూడా కలుగుతున్నాయి. పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి తరఫున హార్దిక్ పటేల్ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 25వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన భారీ ర్యాలీకి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు తరలిరావడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం తెల్సిందే. సెప్టెంబర్ 19వ తేదీన రివర్స్ దిండి యాత్ర పేరు మార్చి ఏక్తా యాత్ర పేరిట పటేళ్లు ఎక్కువగా ఉన్న సూరత్‌లోని వరచ్చాలో నిర్వహించిన ర్యాలీకి 144వ సెక్షన్ కింద విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కనీసం 50 మంది కూడా హాజరు కాలేదు. అలాగే సెప్టెంబర్ 22, మంగళవారం గుజరాత్‌లోని అరవల్లి జిల్లాలో పటేల్ నిర్వహించిన సమావేశానికి కేవలం రెండు వేల మంది ప్రజలు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు రావడంతో పటేల్ అక్కడి నుంచి తప్పించుకొని తన కావల్‌కేడ్‌లో పారిపోయారు. అన్ని రహదారుల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తుండడంతో కారు లో శ్రేయస్కరం కాదని భావించిన పటేల్ ఓ సాధారణ దొంగలా పొలాల వెంట పారిపోయారు.

ఆ మరుసటి రోజు పటేల్ గుజరాత్ టీవీ ఛానెల్ ముందుకొచ్చి...మఫ్టీలో ఉన్న పోలీసులు తనను నిర్బంధంలోకి తీసుకొని రాత్రంతా కారులోనే బంధించి ఉంచారని, అహ్మదాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని ధ్రంగాధర వద్ద వదిలేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని పటేల్ అనుచరులు టీవీ ఛానెళ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన కనిపించలేదు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ప్రజలు పెల్లుబికిన ఆగ్రహావేశాలతో వీధుల్లోకి వచ్చి ఆరాచకం సృష్టిస్తారు. కనీసం ఆగస్టు 25న జరిగిన సంఘటనల లాంటివి కూడా పనరావృతం కాకపోవడం గమనార్హం.

 అదే రోజు అర్ధరాత్రి పటేల్ కనిపంచడం లేదంటూ ఆయన అనుచరులు దాఖలు చేసిన హబియస్ కార్పస్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా చీవాట్లు పెట్టడం పటేల్‌కు మరో ప్రతికూల పరిణామం. తనను మఫ్టీలో ఉన్న పోలీసులు నిర్బంధించారంటూ పటేల్ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఓ దొంగ లాగా పొలాల గుండా పారిపోవడాన్ని తాము గమనించామని, అందుకని సకాలంలో ఆయన్ని పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టగలిగామని గాంధీనగర్ పోలీస్ ఇనిస్పెక్టర్ జనరల్ హాస్ముక్ పటేల్ వ్యాఖ్యానించారు. పటేల్‌ను నిజంగానే నిర్బంధించారనడానికి పటేల్‌గానీ, ఆయన అనుచరులుగానీ ఇప్పటికీ ఆధారాలు చూపించలేకపోతున్నారు.  

 వాస్తవానికి సెప్టెంబర్ 14న గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌తో హార్దిక్ పటేల్ బృందం చర్చలు జరపిన నాడే రిజర్వేషన్ల ఉద్యమం నీరుగారుతున్న విషయం అర్థమైంది. ఆ సమావేశంలో పటేళ్ల రిజర్వేషన్ల గురించి పటేల్ బృందం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆగస్టు 25న పటేళ్లపై విరుచుకుపడిన 4,200 మంది పోలీసులపై చర్య తీసుకోవాలని, హోం శాఖ సహాయ మంత్రి రజనీకాంత్ పటేల్‌ను కఠినంగా శిక్షించాలని మాత్రమే పటేల్ బృందం డిమాండ్ చేసింది. పది రోజుల్లో డిమాండ్లను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పది రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ చర్యా లేదు. పటేళ్ల నుంచి ఏ స్పందనా లేదు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్న హెచ్చరించిన ఎన్‌ఆర్‌ఐ పటేళ్లు కూడా తర్వాత తమ ప్రతిపాదనను విరమించుకున్నారు.

 తమ రాజకీయ అవసరాల కోసం హార్దిక్ పటేల్‌ను హీరో చేసిన అదృశ్య శక్తులే మళ్లీ ఆయన్ని జీరో చేశాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమాన్ని లేవదీసి, తద్వారా మొత్తం రిజర్వేషన్ల విధానాన్నే సమీక్షించాలన్నది అధికారంలోవున్న భారతీయ జనతాపార్టీ, దానికి మద్దతు ఇస్తున్న ఆరెస్సెస్ నేతల వ్యూహమని ఒక వర్గం విశ్లేషకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థను సమీక్షించాల్సిందేనంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన డిమాండ్‌ను ఆ వర్గం ప్రస్తావిస్తోంది. మరెందుకు ఉద్యమాన్ని చల్లార్చినట్టు అని ప్రశ్నిస్తే.....ఓ పక్క బీహార్ ఎన్నికలు, మరోపక్క ఇది సరైన అదనుకాదని, తమకు అనుకూలంగా రాజకీయ పరిస్థితులు లేవని గ్రహించడం వల్లనే ఉద్యమాన్ని నడిపించిన శక్తులే, ఉద్యమాన్ని నీరుగార్చాయన్నది వారి సమాధానం.

వి.నరేందర్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement