చంఢీగడ్ : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ మద్యం మానేస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో మాన్ ఈ ప్రకటన చేశారు. పంజాబ్‌కు చెందిన మాన్ కమెడియన్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆప్‌లో చేరి సంగ్రూర్ ఎంపీగా గెలుపొందారు. అయితే మాన్‌కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉంది. దీని వల్ల అతను చాలాసార్లు విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
ఈ విషయం గురించి మాన్ మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడో సందర్భాన్ని బట్టి తాగేవాడిని. కానీ ప్రతిపక్షాలు దీన్ని ఆధారంగా చేసుకుని నన్ను విమర్శించేవారు. మాన్ రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం మత్తులోనే ఉంటాడు. ఎప్పుడు తాగుతూనే ఉంటాడని ఆరోపించేవారు. అంతేకాక ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా పేరు చెడగొట్టాలని ప్రయత్నించేవారు. ఈ వీడియోలను చూస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది’ అని వాపోయారు.
అంతేకాక ‘మా అమ్మ కూడా నాతో ఇదే విషయం చెప్పింది. నువ్వు ఎప్పుడో ఒకసారి తాగుతావు.. కానీ టీవీల్లో మాత్రం నిత్యం మద్యం సేవిస్తూనే ఉంటావని చూపిస్తున్నారు. ఈ అలవాటును మానుకోకపోతే.. నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి తాగడం మానేయమని కోరారు. దాంతో ఈ జనవరి 1 నేనొక తీర్మానం చేసుకున్నాను. ఇక జీవితంలో మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నాను. ఇకనైనా ప్రతిపక్షాలు నా గురించి తప్పుడు ప్రచారం మానేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని తెలిపారు. మాన్ నిర్ణయం పట్ల కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో మాన్ మార్పుకు పునాది వేశారని కేజ్రీవాల్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment