
చండీగఢ్: కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడంతో అడవి జంతువులు రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఒక అడవి దున్న రోడ్డు పైకి వచ్చి స్థానికులను ఆశ్చర్యపరచగా, కేరళలో మలబార్ సివెట్ రోడ్డుపై ఠీవిగా నడుచుకుంటూ వెళుతూ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చండీగఢ్‌లో చోటు చేసుకుంది. ( కరోనా: కేరళ రోడ్డుపై అనుకోని అతిథి)
చిరుతను పోలిన ఓ అడవి జంతువు సోమవారం చండీగఢ్‌లోని సెక్టార్ 5 రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఒక ఇంటిలో కనిపించింది. దీంతో అక్కడ ఉన్న ఎవ్వరు ఇళ్లు దాటి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే వచ్చిన జంతువు చిరుత పులి అని పోలీసులు చెబుతుండగా.. అది చిరుతపులి అని కచ్ఛితంగా చెప్పలేమని వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్‌లు చెబుతున్నారు.
దీనిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ జస్పాల్‌సింగ్ మాట్లాడుతూ ‘ఇక్కడ చిరుత పులి ఉందని తెలుసుకోగానే ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రకటించాం. ఇప్పటి వరకు ఈ జంతువు వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. అటవీశాఖ అధికారులకు దీనికి సంబంధించి సమాచారం అందించాం. ఆ జంతువు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడే చెప్పలేం. ఆదివారం కూడా కొన్ని మగ జింకలు రోడ్డు మీద తిరగడం నేను చూశాను ’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment