పట్నా : ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వతీరుపై బిహార్ సీఎం నితీష్ కుమార్ మండిపడ్డారు. రాజస్థాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి 300 బస్సులను ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం పంపింది. అదే రీతిలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించకపోవడం అన్యాయం అని నితిష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'కోటాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నత కుటుంబాలకు చెందిన వారు. చాలా మంది విద్యార్థులు కోటాలోనే వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. వారిని అంత అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఏముంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా నిరాశ్రయులుగా ఉన్న బిహార్‌కు చెందిన వలస కార్మికుల విషయంలో ఎందుకు ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తున్నారు' అని నిప్పులు చెరిగారు. విద్యార్థులను లాక్‌డౌన్ సమయంలో తిరిగి రప్పించడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. మార్చిలో ఢిల్లీ నుంచి కార్మికులను తరలించడం కూడా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
ఇదే సమయంలో, ఎక్కడివారు అక్కడే ఉండి కరోనా వ్యాప్తి అరికట్టడానికి సహకరించాలని బిహార్‌కు చెందిన విద్యార్థులు, వలస కార్మికులకు ఉద్దేశించి నితీష్ కుమార్ పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికుల రక్షణ కోసం బిహార్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంబంధిత రాష్ట్రాలతో చర్చలు జరుపుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment