బాబుకు షాకిచ్చిన నితీశ్ | bihar cm nitish kumar shocks to andhra pradesh cm Chandrababu naidu | Sakshi
Sakshi News home page

బాబుకు షాకిచ్చిన నితీశ్

Published Thu, Nov 19 2015 8:10 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

బాబుకు షాకిచ్చిన నితీశ్ - Sakshi

బాబుకు షాకిచ్చిన నితీశ్

 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబును పిలవని నితీష్
 పిలిస్తే వెళ్లడానికి సిద్ధపడిన చంద్రబాబు

 
 
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న నితీశ్ కుమార్.. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. ఇటీవలి బిహార్ ఎన్నికల్లో జేడీ (యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీల గ్రాండ్ అలయెన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ వరుసగా మూడోసారి బిహార్ ముఖ్యమంత్రి శుక్రవారం పాట్నాలోని గాంధీ మైదాన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, రాజకీయ పార్టీల నేతలకు నితీశ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. బిహార్ ఎన్నికల తర్వాత రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని భావిస్తున్న తరుణంలో నితీశ్ నుంచి ఆహ్వానం అందుతుందని చంద్రబాబు ఎంతో ఆశగా ఎదురు చూశారు. గురువారం సాయంత్రం వరకు కూడా నితీశ్ నుంచి ఫోన్ రాకపోవడంతో పార్టీకి చెందిన ఢిల్లీలోని నేతలను కూడా వాకబు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పిలవాలన్న ఆలోచన నితీశ్కు లేదన్న సమాచారం పార్టీ నేతలు ఇవ్వడంతో చంద్రబాబు ఒక్కసారిగా ఢీలా పడినట్టు ఆ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో మారబోయే పరిణామాలను గమనించి నితీశ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడాన్ని ఒక  రాజకీయ అవకాశంగా ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించినప్పటికీ అది నెరవేరకపోవడం నిరాశపరిచిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
 
 దాదాపు 35 మంది కీలక నేతలకు ఆహ్వానం


ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు రాష్ట్రాల సీఎంలకు, పార్టీల నేతలకు నితీశ్ స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. అయితే మలేషియా పర్యటనకు బయలుదేరుతున్న కారణంగా తాను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోతున్నాననీ, కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి వెంకయ్యనాయుడిని పంపిస్తున్నట్టు మోదీ తెలిపారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలతో పాటు అస్సాం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించారు.

ఇకపోతే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉప నాయకుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం, సీపీఐ నేత డి రాజా, డీఎంకే నాయకుడు స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ ఫరూక్, ఎన్‌ఎల్‌డీ నాయకుడు చౌదురి అజిత్ సింగ్‌లతో పాటు పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఇతర నాయకులను నితీశ్ స్వయంగా ఆహ్వానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement