మహా మానవ హారం
మహా మానవ హారం
• ప్రపంచంలోనే పొడవైన హారం ఏర్పాటు చేసిన బిహార్
• 11,400 కి.మీ. పొడవునా.. 3 కోట్ల మంది ప్రజలతో
పట్నా: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవహారాన్ని శనివారం ఏర్పాటు చేసిన బిహార్ ప్రజలు, సంపూర్ణ మద్య నిషేధానికి తాము మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. 11,400 కి.మీ పొడవైన మానవ హారాన్ని దాదాపు మూడు కోట్ల మంది బిహార్ ప్రజలు కలిసి 45 నిమిషాల పాటు శ్రమించి నిర్మించారు. ఈ ఘట్టాన్ని కెమెరాల్లో బంధించేందుకు బిహార్ ప్రభుత్వం 40 డ్రోన్లు, నాలుగు విమానాలు, ఒక హెలికాప్టర్‌ను వాడింది. ఉపగ్రహా చిత్రాలు తీయడానికి ఇస్రో సాయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం 12.15 నిమిషాల నుంచి ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం సాగింది. హారంలో సీఎం నితీశ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌లు పక్క పక్కన నిలబడి చేతులు పట్టుకున్నారు. గతంలో ప్రపంచపు అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీతో బంగ్లాదేశ్ పేరిట ఉండేది.
2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో దేశీ, విదేశీ, భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం సహా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. తొలుత 11,292 కి.మీ పొడవైన మానవహారం ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందనీ, అంచానాలకు మించి జనం తరలి రావడంతో హారం పొడవు 11,400 కి.మీకు పెరిగిందని నితీశ్ తెలిపారు. ఈ ప్రపంచ రికార్డు నమోదు కోసం గిన్నిస్ బుక్ ప్రతినిధులను సంప్రదించారా అని అడగ్గా, ‘మేం ఎందుకు సంప్రదించాలి? గిన్నిస్‌బుక్, గిన్నిస్‌బుక్‌లా ఉండాలంటే, వాళ్లే ఈ మాహా మానవ హారాన్ని గుర్తించి నమోదు చేసుకోవాలి’అని నితీశ్ బదులిచ్చారు.