జైలులో ఖైదీల సరిగమలు
సప్త సర్వరాలతో కూడిన రాగాలు శ్రావ్యంగా ఆలపిస్తే.. బండరాళ్లు సైతం నాట్యం చేస్తాయంటారు. అంతేకాదు వ్యాధులనూ నయం చేయొచ్చంటారు సంగీత విద్వాంసులు! సంగీతం చేసే అద్భుతాలు ఇంకా ఎన్నెన్నో! బీహార్ జైలులోనూ అలాంటి ఓ అద్భుతమే చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని భగల్పూర్ సెంట్రల్ జైలులో పలు తీవ్ర నేరాల్లో శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలు కొందరు.. సంగీతం పాఠాలతో సౌమ్యులుగా మారిపోయారట! ఎంతకీ రాని పరివర్తన సంగీతంలో ఎలా సాధ్యమైందో శుక్రవారం మీడియాకు వివరించారు జైలు సూపరింటెండెట్ నీరజ్ ఝా.
'మా జైలులో నెల రోజుల నుంచి సంగీత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆసక్తిగల కొందరు ఖైదీలు సంగీతం క్లాసులకు రోజూ హాజర్యేవారు. ప్రస్తుతం వారు హార్మోనియం, సింథసైజర్, డ్రమ్స్ వాయించడంలో ప్రావీణ్యం సాధించారు. అదేం విచిత్రమోగానీ అంతకుముందు కరుకుగా ప్రవర్తించేవాళ్లు ఈ మధ్య మృదువుగా మారారు. జైలు సిబ్బంది, తోటి ఖైదీలతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి మార్పు. త్వరలోనే ఖైదీలందరూ సంగీతం క్లాసులకు హాజరవుతారని, మా జైలు నందనవనంలా మారుతుందని ఆశిస్తున్నాం' అంటూ ఖైదీల పరివర్తనా క్రమాన్ని వివరించారు నీరజ్ ఝా.