
జీన్సు వేసి.. గుర్రమెక్కి.. మంత్రిగారి హల్‌చల్
బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నట్టుండి హల్‌చల్ చేశారు. రాష్ట్ర రాజధాని పట్నా నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువైపోయాని, వాటిని అరికట్టాలంటే కార్ల వాడకం తగ్గించాలని భావించారు. తలచిందే తడవుగా.. బిహార్ పోలీసు శాఖలోని అశ్వికదళానికి చెందిన ఓ గుర్రాన్ని తెప్పించి, దాన్ని నడుపుకొంటూ నగర వీధుల్లో తిరిగారు.
జీన్సు ప్యాంటు వేసుకుని, దానిపై లాల్చీ ధరించి.. గుర్రపుస్వారీ మొదలుపెట్టారు. గతంలో జేడీ(యూ)కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనంత సింగ్ ఎక్కువగా గుర్రపుబండిలో తిరుగుతూ పట్నాలో కనిపించేవారు. నగరంలో వాహనాలు బాగా ఎక్కువైపోయి కాలుష్యం, ట్రాఫిక్ జామ్ పెరిగాయని, వాటికి పరిష్కారం గుర్రపు స్వారీయేనని ఆయన తెలిపారు. అయితే, ఎంతైనా మంత్రిగారు కాబట్టి సెక్యూరిటీ కూడా అవసరమే కదా.. సెక్యూరిటీ సిబ్బందిలో కొంతమంది గుర్రాల మీద, మరికొందరు కాలినడకన తేజ్‌ప్రతాప్‌ను ఫాలో అయ్యారట.