
పార్లమెంటుకు‘న్యాయ కమిషన్’ బిల్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసి.. న్యాయ నియామకాల కమిషన్ (జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్- జేఏసీ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. న్యాయవ్యవస్థ నుంచి ఎదురైన వ్యతిరేకతను అధిగమించి ప్రభుత్వం ‘న్యాయ నియామకాల కమిషన్ బిల్లు - 2013’ను తీసుకువచ్చింది. దీనిని అమలు చేయటానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. సంబంధిత బిల్లును న్యాయమంత్రి కపిల్ సిబల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో పాల్గొనే వారిని ఈ కమిషన్ జవాబుదారులుగా చేస్తుందని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను తీసుకువస్తుందని బిల్లు పేర్కొంటోంది. ప్రతిపాదిత కమిషన్ ఏర్పాటుతో.. ఉన్నత న్యాయస్థానాల్లో సభ్యుల నియామకంలో కార్యనిర్వాహక విభాగానికి కూడా పాత్ర లభిస్తుంది. ప్రస్తుతం న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే ఏకైక దేశం బహుశా భారత్ ఒక్కటే కావచ్చు. కొలీజియం పద్ధతిని మార్చేందుకు 2003లో చేసిన ప్రయత్నం ఫలించలేదు. తాజా బిల్లు ప్రకారం.. సీనియర్ న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.