న్యూఢిల్లీ: జైల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులుగా తేలినప్పటినుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను తిరస్కరించడానికి ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు-2013 పేరుతో న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ దీన్ని ప్రవేశపెట్టారు.
1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర కేబినెట్ గత వారం ఆమోదించింది. జైల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అప్పీలు పైకోర్టులో పెండింగ్‌లో ఉన్నంతకాలం ఓటేయకుండా, జీతాలు పుచ్చుకోకుండా పదవుల్లో కొనసాగేందుకు దీన్ని తెచ్చారు. దోషిగా ప్రకటించాక 90 రోజుల్లోపల అప్పీలు చేసుకున్నా, దోషిత్వంపై స్టే ఉన్నా అనర్హత వర్తించదని ఇందులో పేర్కొన్నారు. బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఈ ఏడాది జూలై 10 నుంచి అమల్లోకి వ స్తుంది.