
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ సోమవారం 93వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వాజ్‌పేయ్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వాజ్‌పేయ్ ఇంటికి వెళ్లాను. ఆయన కుటుంబంతో కూడా కొద్దిసేపు గడిపాను’ అని అనంతరం ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య సైతం వాజ్‌పేయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా 93 మంది ఖైదీల్ని యూపీ సర్కారు విడుదలచేసింది. శిక్షాకాలం పూర్తయినా కోర్టు విధించిన జరిమానా చెల్లించలేకపోవడంతో వీరందరూ ఇన్నాళ్లూ జైలులోనే ఉండాల్సి వచ్చింది.