
బీజేపీ కొత్త ఎత్తులు
శ్రీలంకతో తమిళజాలర్ల సమస్యను పరిష్కరించడం ద్వారా చెన్నై జార్జ్‌కోటపై జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది.
శ్రీలంకతో తమిళజాలర్ల సమస్యను పరిష్కరించడం ద్వారా చెన్నై జార్జ్‌కోటపై జెండా ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో పాగావేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా బీజేపీలో మత్స్య విభాగాన్ని ప్రారంభించి కొత్త ఎత్తులకు తెరలేపింది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: బంగాళాఖాతంలో భారత్ ఆధీనంలోని కచ్చదీవులను శ్రీలంకకు స్వాధీనం చేయడం ద్వారా వివాదం తలెత్తింది. ఈ వివాదం రానురానూ బాగా ముదిరిపోతోంది. శ్రీలంకతో తమిళనాడు వైరం రావణకాష్టంలా రాజుకుంటూనే ఉంది.కేంద్ర, రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నా శ్రీలంక, తమిళనాడుల మధ్య సాగుతున్న ఎడతెగని పోరుతో సతమతంకాక తప్పడం లేదు.
యూపీఏ-1, 2లలో కీలక భాగస్వామిగా ఉండిన డీఎంకే అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉండికూడా శ్రీలంక సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. ఈ వైఫల్యం అన్నాడీఎంకే ఒక ఆయుధంగా మలుచుకుంది. ముఖ్యమంత్రిగా జయలలిత తొలి రెండేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో శ్రీలంక అంశంపై ఉత్తరాల యుద్ధమే చేశారు.
శ్రీలంక, భారత్ మత్య్సకార ప్రతినిధులతో అధికారిక చర్చలు జరిపించారు. అయినా ఫలితం కానరాలేదు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదే సమయంలో శ్రీలంక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీయం జయ భావించారు. గతంలో మిత్రపక్షం, నేడు సైతం సత్సంబంధాలు కలిగి ఉన్న జయలలిత కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడం ద్వారా శ్రీలంక సమస్యను ఒక కొలిక్కి తేవాలని గట్టిపట్టుతో ఉన్నారు.
క్రెడిట్ కోసం బీజేపీ
కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే శ్రీలంక సమస్యకు పరిష్కారం లభించదు. తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని ఎన్నికల సభల్లో సాక్షాత్తు మోడీనే తమిళనాడు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాని హోదాలో మోడీ ఎలాగూ ఎంతో కొంత చేయక తప్పదు. అన్నాడీఎంకే నుంచి ఒత్తిడి రావడం ద్వారా పరిష్కారం లభించిందనే భావనకు అవకాశం లేకుండా ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక బలమైన ప్రచారాస్త్రంగా మారడం ఖాయం. అందుకే ఇంతవరకు ఆలోచనే లేని బీజేపీ గురువారం హడావుడిగా మత్స్య విభాగాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మత్య్స విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.సతీష్‌కుమార్ నేతృత్వంలో సమస్య పరిష్కార దిశగా సుదీర్ఘ చర్చలు జరిపింది.
బంగాళాఖాతంలో తమిళజాలర్లు స్వేచ్ఛగా చేపల వేట సాగించే హక్కును కల్పించాలని ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాష్ర్టం నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్ రాధాకృష్ణన్‌లను ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరవణ పెరుమాళ్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన బృందాన్ని ఆయన నియమించారు. ఈనెల 10, 11, 12 తేదీల్లో రామేశ్వరం, పుదుక్కోట్టై, తంజావూరు, నాగపట్టణాల్లో పర్యటించి మత్య్సకార కుటుంబాలను ఈ బృందం కలుసుకుంటుంది.
16వ తేదీన కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో చెన్నైలో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో శ్రీలంక సమస్యపై శాశ్వత పరిష్కారాన్ని కనుగొని ఒక బృందం ఢిల్లీ వెళ్లి మోడీ, సుష్మాలను కలిసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శ్రీలంక సమస్యను పరిష్కరించడం ద్వారా రాబోవు అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.