
ఢిల్లీలో బీజేపీని పక్కన పెట్టారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పై మరోమారు ఫైర్ అయ్యారు. సరి, బేసి నియమాన్ని పాటించవొద్దని బీజేపీ ప్రచారం చేసింది, కానీ ఢిల్లీలో ప్రజలు బీజేపీనే పక్కన పెట్టారని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత జనవరిలో కూడా అధికారులతో సరి, బేసి నియమానికి వ్యతిరేకంగా బీజేపీ ధర్నాలు చేపించిందని మండిపడ్డారు. సరి, బేసీ విధానానికి వ్యతిరేకంగా బీజేపీకి చెందిన ఆటో యూనియన్ ధర్నాలకు పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. ఈ విధానాన్ని కనుమరుగు చేయాలని చూస్తే ఢిల్లీ ప్రజలు బీజేపీనే పక్కన పెట్టి సరి- బేసీ విధానాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.
ఢిల్లీలో మరోమారు సరి, బేసి నియమం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. నగర రోడ్లపై వాహన రద్దీని, కాలుష్యాన్ని నియంత్రించే ఉద్దేశంతో అమలుచేస్తున్న ఈ నియమం ప్రకారం శుక్రవారం నుంచి సరి నంబరు ప్లేటున్న కార్లు సరి తేదీల్లో, బేసి నంబరున్న కార్లు బేసి తేదీల్లో రోడ్లపైకి రావలసి ఉంటుంది. సీఎన్జీ స్టిక్కరు కలిగిన వాహనాలు, బ్యాటరీ హైబ్రిడ్ వాహనాలు, ఒంటరి మహిళలు నడిపే వాహనాలు, యూనిఫామ్ ధరించిన స్కూలు పిల్లలున్న కార్లు, వికలాంగుల కార్లు, ద్విచక్రవాహనాలకు ఈ నియమం నుంచి మినహాయింపునిచ్చారు.
ఇలా ఉండగా శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలు కావడం, ఆదివారం దీనికి మినహాయింపు ఉండడం వల్ల సోమవారం నుంచే అసలు పరీక్ష ప్రారంభం కానుంది. ప్రభుత్వం మాత్రం రెండో దశను కూడా విజయవంతంగా అమలుచేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్కూలు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్కూలు బస్సులకు కోత విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశముంది.