ఓట్ల పరంగా ఏకైక అతిపెద్ద పార్టీ బీజేపీ
పట్నా: బిహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించింది. భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది. నితీశ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎన్డీయే కూటమి అతి తక్కువ సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పోల్చితే మహాకూటమి కొత్తగా, అనూహ్యంగా సాధించిందేమీ లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరు కూటముల్లో పోటీచేసి 49.8% ఓట్లు సాధించగా ఈసారి ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేసి 41.9% ఓట్లను మాత్రమే సాధించగలిగాయి. సీట్ల పరంగా చూస్తే మహాకూటమిలోని పార్టీల బలాబలాలు మారినా ఓట్ల పరంగా చూస్తే ఆ కూటమి నష్టపోయింది. అలాగే ఎన్డీయే కూటమి ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని అనుకోవడానికి వీల్లేదు.
ఎందుకంటే 2010 ఎన్నికల్లో బీజేపీ, ఎల్జేపీ కలిపి 24% ఓట్లను సాధించగా ఈసారి ఒంటరిగానే బీజేపీ 24.8% ఓట్లను సాధించింది. అపుడు కూటమిలో జేడీయు కూడా ఉంది. 2010 ఎన్నికల్లో కలసి పోటీ చేసిన ఆర్జేడి, కాంగ్రెస్‌తో ఈసారి జేడీయూ చేతులు కలిపింది. 49.8% ఓట్లు సాధించిన మూడు పార్టీలతో మహా కూటమి అవతరించింది. నితీశ్‌కుమార్ పాలనపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ఆర్జేడీ, కాంగ్రెస్‌లను ఓటర్లు ఇప్పటికే రెండుసార్లు శిక్షించి ఉండడంతో మహా కూటమి సునాయాసంగానే విజయం సాధించింది. సీట్లు కోల్పోయినా ఓట్ల పరంగా చూస్తే బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఆ పార్టీ 91.5 లక్షల ఓట్లు సాధించగా ఆర్జేడీ 67.9 లక్షలు, జేడీయు 62లక్షలు, కాంగ్రెస్ 25 లక్షల ఓట్లు సాధించాయి. బీజేపీ 24.8%, ఆర్జేడీ 18.5%, జేడీయూ 16.7 %, కాంగ్రెస్6.7% ఓట్లు సాధించాయి. ఏ రాష్ర్టంలోనైనా అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంటు ఎన్నికలను ఒకే గాటన కట్టడానికి వీల్లేదు. ఈరెండింటినీ జనం వేర్వేరుగానే భావిస్తారు. బిహార్ ఫలితాలు అసహనానికి చెంపపెట్టు అని, ఉదారవాదానికి జేజేలు పలికారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కూటముల అమరికే ఫలితాలను ప్రభావితం చేసిన ప్రధానాంశం. దాంతోపాటు సామాజిక వర్గాల పొందిక, స్థానిక సమస్యల ప్రాతిపదికన కూడా మహాకూటమిలోని పార్టీలు తమ ఓట్లను తాము కాపాడుకోగలిగాయి.