బీజేపీ నేతకు భారీ షాక్‌ | Bjp leader H Raja lose in Bharat Scouts and Guides elections | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతకు భారీ షాక్‌

Published Sun, Sep 17 2017 10:44 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM

హెచ్‌ రాజా, మణి

హెచ్‌ రాజా, మణి

  • కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకున్న రాజా
  • ఉత్కంఠగా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఎన్నికలు
  • అధ్యక్షుడిగా మణి
  • బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజాకు శనివారం పెద్ద షాక్‌ తగిలింది. భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తమిళనాడు విభాగం ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. కేవలం 52 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో విద్యా శాఖ మాజీ డైరెక్టర్‌ మణి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

    సాక్షి, చెన్నై : భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తమిళనాడు విభాగానికి 12 ఏళ్లుగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. అయితే, ఈసారి ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో జాతీయస్థాయి నుంచి మంతనాలు సాగాయి.  ఇందుకు కారణం ఆ సంఘానికి అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజా రేసులో నిలబడడమే. ఎన్నికల బరిలో నిలబడే సమయంలో ఆయన భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తమిళనాడు నిర్వాహకుల మీద విరుచుకుపడ్డారు. విద్యార్థులకు చేరాల్సిన నిధుల్ని దుర్వినియోగం చేశారని, అవినీతి తాండవం చేసినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. అదే సమయంలో ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగడం తమిళనాట రాజకీయ పక్షాల్లో వ్యతిరేకత బయలుదేరింది. అధికారపక్షం పరోక్షంగా మద్దతిచ్చినా, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

    విద్యార్థుల మీద కాషాయం రంగు రుద్దే ప్రయత్నంలో భాగం గానే అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు రాజా తీవ్ర కుస్తీలు పడుతున్నారన్న ఆరోపణలు గుప్పిం చాయి. ఇందుకు రాజా ఎదురుదాడి సాగిం చినా, గెలుపు తనదేనన్న ధీమాతో ముందుకు  సాగారని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో రాజా గెలిస్తే తమిళనాట కమలం పాగే వేసినట్టే అన్నట్టుగా ఆయన మద్దతుదారులు వ్యవహరించా రన్న ప్రచారం ఉంది. అయితే, తమిళనాట కమలం పాదం మోపేందుకు ఆస్కారం లేదన్నట్టుగా స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఎన్నికల్లో తీర్పు రావడం గమనార్హం. కేవలం 52 ఓట్లతో రాజా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఏమేరకు తమిళుల్లో కాషాయం మీద  వ్యతిరేకత ఉందో అనే చర్చ ఊపందుకుంది.

    రాజా ఓటమి
    స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో ఐదు వందల మంది సభ్యులున్నారు. చెన్నై వేదికగా ఓటింగ్‌కు తగ్గ ఏర్పాట్లుచేశారు. ఎన్నికల అధికారిగా కళావతి వ్యవహరించారు. రాజాకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మాజీ ఉపాధ్యక్షుడు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ మణి బరిలో దిగారు. దీంతో పోరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ తప్పలేదు. ఈ పదవికి ప్రప్రథమంగా ఓ రాజకీయ  నేత పోటీకి దిగడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల వరకు సాగిన ఎన్నికల్లో 286 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజా  గెలుపు మీద మద్దతుదారుల్లో ధీమా ఉన్నా, చివరకు ఆయనకు షాక్‌ తప్పలేదు. ఆయన ప్రత్యర్థి మణి భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.

    మణికి 232 ఓట్లు, రాజాకు 52 ఓట్లు రాగా, రెం డు ఓట్లు చెల్లనివిగా తేల్చారు. తనను గెలిపించిన వారందరికీ మణి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కోటి 32 లక్షల మంది మనవళ్లు, మనవరాళ్లు స్కూళ్లల్లో తనకు ఉన్నారని, వీళ్లందరి సంక్షేమం లక్ష్యంగా, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లోని ప్రతి సభ్యుడికి సహకారంగా ముందుకు సాగుతానని ప్రకటించారు. అయితే, ఈ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఈ గెలుపు  చెల్లదంటూ జాతీయస్థాయిలో రాజా ఫిర్యాదు చేసే పనిలో పడ్డారు. అవినీతి చోటుచేసుకుందని, అందుకే ఏకపక్షంగా ఎన్నిక సాగిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దుచేయిస్తానని ఆయన ముం దుకు సాగినా, అందుకు ఆస్కారం లేదని, అన్నీ సక్రమంగానే జరిగినట్టు ఎన్నికల అధికారి కళావతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement