సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్‌కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు.
నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని..
ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు.
ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్‌ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్‌బెయిలబుల్ కేసులు కట్టారు.
బాధితులకు అండగా ప్రభుత్వం
యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment