‘మా అమ్మా నాన్నలు ఇకపై నన్ను టీవీలో చూస్తారు’అని సంతోష పడింది మిన్ను మణి. దేశీయంగా ఆమె ఆడిన క్రికెట్ మేచ్‌లుటీవీలో టెలికాస్ట్ కాలేదు. ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం 30 లక్షలకు మిన్ను మణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంచేసుకున్నాక ఆమె ఆట తప్పక టెలికాస్ట్ కానుంది.
రోజుకు నాలుగు బస్సులు మారి 52 కిలోమీటర్ల దూరంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లిప్రాక్టీస్ చేసిన మణి కేరళలో ఈస్థాయికి ఎదిగిన తొలి గిరిజన మహిళా క్రికెటర్. మహిళా క్రికెట్ ఇప్పుడు విజయ పరంపరలో ఉంది. నిర్లక్ష్య వర్గాల నుంచి కూడా ఈ ఆటకు చేరొచ్చు అని చెబుతున్న మిన్ను మణిది కూడా ఒక విజయగాధ.
‘ముప్పై లక్షల రూపాయలు. నా జీవితంలో చూస్తానని అనుకోలేదు. మొదట నేనొక స్కూటీ కొనుక్కోవాలి. బస్సుల్లో తిరుగుతూప్రాక్టీసుకు ఇకపై వెళ్లను. ఆ తర్వాతే ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచిస్తాను’ అంది మిన్ను మణి. ఫిబ్రవరి 13న ముంబైలో ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం మహిళా క్రికెటర్ల వేలం జరుగుతున్నప్పుడు మిన్ను మణి హైదరాబాద్‌లో సౌత్ జోన్ తరపున ఇంటర్ జోన్ టోర్నమెంట్ ఆడుతోంది. ఆ రోజున 91 బాల్స్‌కు 74 కొట్టి నాటౌట్‌గా నిలిచింది. ఆట ఒకవైపు సాగుతూ ఉన్నా మనసంతా ముంబై ఆక్షన్ మీదే ఉంది.
‘పెద్ద పెద్ద మహిళా క్రికెటర్లకు కూడా వేలంలో ధర పలకకపోతుండే సరికి నిరాశ కలిగింది. నా బేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టారు. ఎవరూ తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఢిల్లీ, బెంగళూరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ నన్ను సొంతం చేసుకుంది. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంది మిన్ను మణి. ‘ఆ విషయం ఫోన్‌లో చెప్తే మా అమ్మా నాన్నలు డబ్బు గురించి కాక నా ఆట గురించి అడిగారు. టీవీలో వస్తుందా అన్నారు. వస్తుంది అని చె΄్పాను’ అంది సంతోషంగా.
కరూచియ
23 ఏళ్ల మిన్ను మణిది కేరళలోని వయనాడ్ జిల్లాలోని గిరిజన గూడెం. ఇది బ్రహ్మగిరి కొండల అంచున ఉంటుంది. మణిది ‘కరూచియ’ గిరిజన తెగ. వీళ్లు తమను తాము కొండ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. తమ ఆచారాలు స్ట్రిక్ట్‌గా పాటిస్తారు. గురి చూసి బాణం వేయడంలో మేటిగా పేరు గడించారు. కాని ఇప్పుడు వారంతా చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతున్నారు. మిన్ను మణి తండ్రి మణి రోజు కూలి. తల్లి వసంత గృహిణి. చిన్నప్పటి నుంచి మిన్ను మగపిల్లలతో కలిసి పొలాల్లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేది.
ఎలిమెంటరీ స్కూల్లో రన్నర్‌గా ప్రతిభ చూపేది. 8 వ తరగతిలో హైస్కూల్లో చేరాక ఆమె ప్రతిభను ఆ స్కూల్లో ఎల్సమ్మ బేబీ అనే పీయీటీ టీచరు గుర్తించింది. ‘మిన్ను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌ఉమన్. బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో ఆ అమ్మాయి టాలెంట్ చూసి చాలా దూరం వెళుతుందని అనుకున్నాను’ అంటుంది ఆ పీయీటీ టీచర్. ఆ పీయీటీ టీచరే పూనుకుని తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ అసొసియేషన్ దగ్గరకు తీసుకువెళితే వారు పరీక్షించి ట్రయినింగ్ ఇచ్చారు. దాంతో మిన్ను మణి ముందు వయనాడ్ జిల్లా జట్టుతో అటు పిమ్మట అండర్ 16 జట్టుతో ఆ తర్వాత కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడటం మొదలుపెట్టింది.
కష్టే ఫలి
అయితే మిన్ను మణి క్రికెట్ ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ‘కేరళలో అమ్మాయిలు అథ్లెట్లుగా రాణిస్తారు. నన్ను కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చూడాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. క్రికెట్ మగవాళ్ల ఆట అని వారి అభి్రపాయం. కాని మా పీయీటీ టీచరు వారిని ఒప్పించి నన్ను క్రికెట్‌లోకి తీసుకెళ్లింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నానని తెలిశాక వారు మనస్ఫూర్తిగా ్రపోత్సహించసాగారు’ అంది మిన్ను.
కానీ క్రికెట్‌లాంటి ఖరీదైన ఆటకు కావలసిన మంచి కిట్ కూడా మిన్ను దగ్గర లేదు. వాళ్ల నాన్న అప్పులు చేసి మిన్ను ఆట కొనసాగేలా చూశాడు. మిన్నుప్రాక్టీసు చేయాలంటే వారి గూడేనికి 52 కిలోమీటర్ల దూరంలోని కృష్ణగిరి క్రికెట్ స్టేడియమే గతి. అంత దూరం వెళ్లడానికి మిన్ను తెల్లవారు జామునే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి నాలుగు బస్సులు మారి స్టేడియంకు చేరుకునేది. తిరిగి ఇల్లు చేరే సరికి సాయంత్రం 7 అయ్యేది. ‘అలిసిపోయేదాన్ని. కాని పట్టుదలగా ఆట కొనసాగించాను’ అంటుంది మిన్ను.
ఆటలో విజయాలు
మిన్ను మణి కేరళ అండర్ 23లో ఆ తర్వాత భారత్ అండర్ 23 జట్టులో ప్రతిభ చూపింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై ఆడింది. విమెన్స్ ఆల్ ఇండియా ఒన్ డే టోర్నమెంట్‌లో 8 మేచ్‌లు ఆడి 246 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. దాంతో అందరి దృష్టి మిన్ను మీద పడింది.
క్రికెట్ ఆడటం మొదలెట్టాక వచ్చిన కొద్ది పాటి డబ్బులో ప్రతి పైసా తన కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించింది. మిగిలిన డబ్బుతో చిన్న ఇల్లు కడితే 2018 వరదల్లో ఆ ఇల్లు దెబ్బతింది. క్రికెట్ అభిమానులు ఆదుకుని రిపేర్లు చేయించారు. ఇప్పుడు 30 లక్షల సంపాదన స్థాయికి మిన్ను చేరింది. ‘దీని కంటే జాతీయ జట్టులో స్థానంపొందడమే నాకు ఎక్కువ ఆనందం. అదే నా లక్ష్యం’ అంటోంది మిన్ను మణి.
Comments
Please login to add a commentAdd a comment