ఫుల్లుగా తాగుతూ రైలులో రాత్రంతా వీరంగం
ముంబయి: వాణిజ్య నగరం ముంబయికి వెళుతున్న అమరావతి రైలులోని ఓ కోచ్‌లో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. బీజేపీ కార్యకర్తలు, మహారాష్ట్రలోని ఓ మంత్రి అనుచరులు పీకలదాకా తాగి రాత్రంతా రచ్చరచ్చ చేశారు. వారిని ప్రత్యక్షంగా ఎదుర్కోవాల్సి వచ్చిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిణి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయి వెళుతున్న అమరావతి ఎక్స్ ప్రెస్ రైలులో అరవింద్ లాండే, యోగాశ్ నాథే, ప్రమోద్ గైక్వాడ్, సందీప్ ఉగ్లే నలుగురు డిసెంబర్ 4న 3ఏ అనే కోచ్‌లో అకోలా వద్ద ఎక్కారు. అదే కోచ్‌లో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిణి కూడా ఉంది.
ఆమె పక్క బోగీలోకి వెళ్లొచ్చే సరికి ఆ నలుగురు ఆమె బెర్తుపై ఉన్న బ్యాగును కిందేసి దర్జాగా కూర్చున్నారు. అనంతరం తమతో తెచ్చుకున్న మద్యాన్ని తాగడం మొదలుపెట్టారు. అది కూడా రాత్రి పూట కావడంతో ఇదేమిటని ప్రశ్నించిన ఆమెను ఎక్కువ మాట్లాడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. తాము మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి రంజిత్ పాటిల్ మనుషులమంటూ హెచ్చరించారు. దీంతో ఆమె పక్కన ఉన్నవారి సాయం కోరగా వారు వచ్చి ప్రశ్నించడంతో అందరినీ కలిపి తిట్టారు.
ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలం ఉపయోగించారు. అలా రాత్రంతా రైలులో నానా రభస చేశారు. రైలులోని టికెట్ తనిఖీ అధికారికి, అనంతరం ఆర్బీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. స్టేషన్ మాస్టారుకు చెప్పినా వారు ఫోన్ చేసి అతడిని స్పందించనివ్వకుండా చేశారు. చివరకు ఆమె పట్టు విడిచిపెట్టకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.