రెచ్చిపోయిన బీజేపీ నేత కుమారుడు
రాయ్పూర్: తన తండ్రికి రాజకీయ పలుకుబడి ఉందని ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. తన ముందు వెళుతున్న రెండు బైక్లను క్రాస్ చేసేందుకు ప్రయత్నించి అలా చేయలేక ఆ బైక్ లపై వెళుతున్న వారిపై దాడికి పాల్పడ్డాడు. స్నేహితులతో కలిసి ఆ బైకిస్టులను బురదరోడ్డులో పొర్లించి కొట్టారు. అంతేకాదు తాను చేసిన ఈ ఘనకార్యాన్ని వీడియో రికార్డు చేయడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో స్వయంగా పెట్టాడు. ఈ వీడియో ఆధారంగా ఆ నేత కొడుకు, అతడి స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఈ ఘటన గత నెలలోనే జరిగింది.
వివరాల్లోకి వెళితే గత ఆగస్టు 15న ఖేర్ కట్టా ప్రాంతంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాంథురాం పవార్ కుమారుడు నన్ను పవార్ ఎస్యూవీ వాహనంపై వెళుతున్నాడు. అతడు వెళుతున్న మార్గంలోనే సాధారణంగా ఓ ఇద్దరు యువకులు బైక్ లపై వెళ్లారు. అలా వెళుతున్నవారిని క్రాస్ చేసేందుకు స్నేహితులతో కలిసి వేగంగా ప్రయత్నించినప్పటికీ తొలుత అది వీలుకాలేదు. దీంతో మరోసారి వారిని క్రాస్ చేసి తమనే దాటి ముందుకు వెళతారా అంటూ రెచ్చిపోయిన నన్ను పవార్ బైకర్స్పై దాడి చేసి స్నేహితులతో దాడిచేయించాడు. స్వయంగా దీనిని వీడియో తీసి చివరకు అడ్డంగా బుక్కయ్యాడు.