పదవులపై బీజేపీ కుస్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ఫలితాలు లాంఛనప్రాయమే, గెలుపు తథ్యం అనే ధీమాతో ఉన్న బీజేపీ.. ప్రభుత్వం ఏర్పాటు కోసం, పార్టీలో మార్పు చేర్పుల కోసం తర్జన భర్జనలు ప్రారంభించింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో సీనియర్ నేతలు ఎవరెవరికి ఏయే పదవులు కట్టబెట్టాలనే దానిపై చర్చోపచర్చలను ముమ్మరం చేసింది. మోడీ నేతృత్వంలో ఏర్పాటయ్యే సర్కారులో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు కీలక పదవి అప్పగించాలని ఆరెస్సెస్ ఒత్తిడి చేస్తోంది. సీనియర్ నేత అద్వానీకి స్పీకర్ పదవి ఇవ్వజూపగా, ఆయన నిరాకరించినట్లు సమాచారం. ఎన్డీఏ చైర్మన్ వంటి రాజకీయ ప్రాధాన్యం గల పదవులను ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అద్వానీతో రాజ్‌నాథ్ గురువారం చర్చలు జరిపారు. అంతకు ముందు రాజ్‌నాథ్ నివాసంలో బీజేపీ, ఆరెస్సెస్ సీనియర్ నేతలు సమావేశమై దాదాపు రెండు గంటల సేపు చర్చలు సాగించారు. ఈ భేటీలో ఆరెస్సెస్ నేతలు సురేశ్ సోనీ, రామ్‌లాల్, సౌదాన్ సింగ్, వి.సతీశ్ తదితరులు పాల్గొన్నారు. చర్చలు కొనసాగుతుండగా, మోడీ సహచరుడు అమిత్ షా వారితో చేరారు. మరోవైపు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఢిల్లీలో ఆరెస్సెస్ నేతలతో చర్చలు జరిపారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న మురళీ మనోహర్ జోషీ, సుష్మా స్వరాజ్ వం టి వారి పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోషీ, సుష్మ వేచి చూసే వైఖరిని అవలంబిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అద్వానీ స్పీకర్ పదవిని స్వీకరిస్తే, జోషీకి, సుష్మకు కేబినెట్‌లో చోటు లభించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మోడీకి మరింత భద్రతకు ఏర్పాట్లు: ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత ఉన్న మోడీకి మరింత భద్రత కల్పించేందుకు ఎస్పీజీ సన్నాహాలు చేస్తోంది. మోడీకి, ఆయన భార్య యశోదాబెన్, తల్లి హీరాబెన్‌లకు కూడా ఎస్పీజీ భద్రత కల్పించనున్నారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ వస్తే, రాష్ట్రపతి ప్రకటన వరకు ఆగకుండా వెంటనే మోడీకి భద్రత కల్పించేలా ఎస్పీజీ ఏర్పాట్లు చేసుకుంటోంది.