ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీయే !
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందుకోసం అద్వానీ సహా పార్టీ నేతలందరినీ ఒప్పించి, ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా పార్టీలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్ తదితరులు రంగంలోకి దిగారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత అద్వానీతోపాటు ఆయనకు మద్దతుగా ఉన్న సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషీ తదితర నేతలతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశం అనంతరం మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్ నేత అద్వానీతో పాటు ఆయన వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
కానీ, వీలైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని, ఇందుకోసం అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు మోడీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం అద్వానీ సహా పార్టీ నేతలందరినీ ఒప్పించి, ఏకాభిప్రాయాన్ని సాధించే దిశగా పార్టీలో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అనంతకుమార్ తదితరులు గురువారం అద్వానీని కలిసి చర్చించారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించవద్దని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అనంతకుమార్ సుష్మాస్వరాజ్‌తో కూడా భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా సీనియర్ నేతలతో సమావేశమవుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించినా అది శుక్రవారమే జరగనుందని, ఆ లోపే ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాయి. ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో అద్వానీకి మద్దతుగా ఉన్న సుష్మాస్వరాజ్, మురళీ మనోహర్ జోషీలతో రాజ్‌నాథ్‌సింగ్ గురువారం భేటీ అయ్యారు. కాగా, మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీలో భేదాభిప్రాయాలు లేవని రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యానించారు.
మౌనంగానే అద్వానీ
పార్టీ నేతలు తనను కలుస్తున్నా, ప్రధాని అభ్యర్థిత్వం అంశంపై చర్చలు జరుపుతున్నా అద్వానీ మాత్రం గురువారం రాత్రి వరకూ కూడా బహిరంగంగా ప్రకటనా చేయలేదు. అద్వానీ అనుచరుడు సుధీంద్ర కులకర్ణి మాత్రం నరేంద్ర మోడీపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. అంతేగాకుండా శుక్రవారమే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఆ సమావేశంలో అద్వానీ మద్దతుదారులు, సీనియర్ నేతలైన సుష్మాస్వరాజ్, మురళీమనోహర్ జోషీ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. సుష్మా వ్యక్తిగత పనిమీద అంబాలా వెళుతుండగా.. జోషీ ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. కాగా, మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి బీజేపీ కర్ణాటక శాఖ మద్దతు పలికింది.