
ఎదురు దాడే సర్కారు ఆయుధం
చల్లటి వాతావరణంలో.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడిగా, వేడిగా జరగనున్నాయి. వివిధ కుంభకోణాలు, వివాదాస్పద బిల్లులపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు సిద్ధం కాగా, వాటి ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టేందుకు పాలక బీజేపీ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా సమావేశాలు, మంతనాలు జరిపి ఓ కృతనిశ్చయానికి వచ్చింది. ప్రధానంగా లలిత్ గేట్ కుంభకోణంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ల రాజీనామాలను డిమాండ్ చేస్తూ సమావేశాలను స్తంభింపచేయాలని ప్రతిపక్షాలు వ్యూహరచన చేయగా, ఈ కుంభకోణాల్లో తమవారి తప్పేమీ లేదని సమర్థించుకోవడంతో పాటు కుక్క కాటుకు చెప్పుదెబ్బలా కాంగ్రెస్ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఎదురుదాడికి దిగాలని పాలక ఎన్డీయే పక్షాలు వ్యూహరచన చేశాయి. తమ పార్టీకి చెందిన మంత్రులు గానీ, ముఖ్యమంత్రులు గానీ ఎవరూ ఎలాంటి తప్పుచేయలేదని, వారు రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రభుత్వం తరఫున ఇప్పటికే స్పష్టం చేశారు.
పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పిలుపునిచ్చారు. సమావేశాలను సజావుగా నిర్వహించడం సమష్టి బాధ్యతని కూడా ఆయన చెప్పారు. ఏ దశలోనూ ప్రతిపక్షం ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గదని, ప్రతిపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టడమే తమ వ్యూహమని, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలతో అమిత్ షా పార్లమెంట్‌లో ఎన్డీయే పక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చోప చర్చలు జరిపారు. జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితర పార్టీ నేతలను తోడ్కొని వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చర్చించారు. పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండేందుకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ కూడా ఢి ల్లీలోనే మకాం వేశారు. అవసరమైతే సుష్మా స్వరాజ్‌తో సభలో సమాధానం ఇప్పించాలని కూడా అభిప్రాయానికొచ్చారు.
సభలో పరిస్థితులను బట్టి వివాదాస్పదమైన భూసేకరణ, జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ లాంటి పెండింగ్ బిల్లులను తీసుకరావాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడమే ఉత్తమ వ్యూహంగా ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత అమిత్ షా పార్టీ మీడియా ప్రతినిధులతో సమావేశమై పార్టీ వైఖరిని వెల్లడించారు. ఈ సమావేశంలో శ్రీకాంగ్ శర్మ, ఎంజె అక్బర్, సాంబిత్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షాలు దాడి, ఎదురుదాడులకు సిద్ధపడడంతో పార్లమెంట్ సమావేశాలు హోరెత్తనున్నట్టు స్పష్టమవుతోంది.