
పోలింగ్ అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి
లక్నో : యూపీలో మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొరదాబాద్‌లోని బిలారిలో ఓ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రిసైడింగ్ అధికారిని తోసివేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రిసైడింగ్ అధికారి కోరారని ఆయనపై దాడికి తెగబడ్డ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. యూపీలో బీఎస్పీతో పొత్తుతో పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తు సైకిల్ కావడం గమనార్హం.
ఎస్పీ గుర్తు సైకిల్ బటన్‌ను ప్రెస్ చేయాలని ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ జుబైర్ మహిళా ఓటర్లను ఒత్తిడి చేయడంతో తాము అడ్డగించామని బీజేపీ కార్యకర్తలు తెలిపారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో సదరు అధికారిని పోలింగ్ విధుల నుంచి తప్పించారు. మరోవైపు ఇటావాలోనూ ప్రిసైడింగ్ అధికారులు ఓటర్లను సైకిల్ బటన్‌ను ప్రెస్ చేయాలని సూచించారని, యోగేష్ కుమార్ అనే అధికారిని ఈ ఆరోపణలపై పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపారు. ఇక బీజేపీ అభ్యర్ధిగా జయప్రద బరిలో నిలిచిన రాంపూర్ నియోజకవర్గంలో 300కిపైగా ఈవీఎంలు పనిచేయలేదని, నియోజకవర్గ ఓటర్లను అధికారులు బెదిరిస్తున్నారని ఎస్పీ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ ఆరోపించారు.