
మా పార్టీలోనూ అందగత్తెలున్నారు!
ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ప్రియాంకా గాంధీపై బీజేపీ ఎంపీ కతియార్ అనుచిత వ్యాఖ్యలు
• అది బీజేపీ మనస్తత్వమన్న ప్రియాంక
• కూతురి గౌరవం కంటే ఓటు గౌరవం ఎక్కువన్న శరద్ యాదవ్
న్యూఢిల్లీ/పట్నా: ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపాయి. యూపీ కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్త ప్రియాంక గాంధీ కంటే అందమైన ప్రచారకర్తలు తమ పార్టీలో ఉన్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ వినయ్ కతియార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓటుకున్న గౌరవం కూతురి గౌరవం కంటే ఎక్కువని జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ నోరుపారేసుకున్నారు.
స్మృతి కూడా అందమైనవారు: కతియార్
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రియాంక ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బతినవని కతియార్ బుధవారం ఢిల్లీలో విలేకర్లతో అన్నారు. విలేకర్లు ప్రియాంక ప్రచారాన్ని ప్రస్తావించగా.. ‘అదేమంత పెద్ద విషయం కాదు. మా పార్టీలో ఆమెకంటే అందమైన అమ్మాయిలు, మహిళలు ఉన్నారు. వారూ ప్రధాన ప్రచారకర్తలే. వారిలో కొందరు కళాకారులు, హీరోయిన్లు.. స్మృతి ఇరానీ (కేంద్ర మంత్రి) అందమైనవారు, ఆమె కూడా ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన చెప్పారు.
బీజేపీ బుద్ధి అంతే: ప్రియాంక
కతియార్ మాటలు దేశ జనాభాలో సగం ఉన్న మహిళలపై బీజేపీ ఆలోచన తీరుకు అద్దం పడుతున్నాయని ప్రియాంక ధ్వజమెత్తారు. ‘ఎన్నో కష్టాలు ఎదుర్కొని తామున్న స్థాయికి చేరుకున్న అందమైన, శక్తిమంతులైన, ధైర్యవంతులైన నా సహచర మహిళల్లో బీజేపీకి అందం మాత్రమే కనిపిస్తుంటే ఆయన మాటలు నాకు మరింతగా నవ్విస్తున్నాయి’ అని అన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషాహంకారపూరితమైన కతియార్ మాటలు దిగ్భ్రాంతి కలిగించాయని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విమర్శలపై కతియార్ స్పందిస్తూ.. ‘క్షమాపణ చెప్పను. మహిళలంటే నాకెంతో గౌరవం. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అందానికి ఓట్లు పడవని చెప్పానంతే. ప్రియాంక నా మేనకోడల్లాంటిది’ అని అన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పని కతియార్.. శరద్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. కతియార్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని వెంకయ్య పేర్కొన్నారు.
కూతురి గౌరవం కంటే ఓటు గౌరవం మిన్న: శరద్
జేడీయూ నేత శరద్ యాదవ్ పట్నాలో మాట్లాడుతూ ఓటుకున్న గౌరవం కూతురి గౌరవంకంటే ఎక్కువని అన్నారు. ‘ఓటు గౌరవం గురించి అందరూ చెబుతున్నారు. కూతురి గౌరవంతో రాజీపడితే గ్రామ, స్థానిక ప్రాంతం చెడిపోతాయి. ఓటు గౌరవంతో రాజీపడితే.. అమ్ముకుంటే.. మొత్తం ప్రాంతం, రాష్ట్రం, దేశం భ్రష్టపడతాయి’ అని అన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని అన్నారు. కుమార్తెలను ప్రేమగా, గౌరవంగా చూసుకునే మనం దేశ పురోగతి కోసం ఓటు విషయంలోనూ అలాగే మెలగాలని చెప్పుకొచ్చారు. యాదవ్ తన వ్యాఖ్యలకు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసు జారీ చేసింది.