నేనే తప్పూ చేయలేదు
జోధ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో తాను ఏ తప్పూ చేయలేదని, తనను అకారణంగా ఈ కేసులో ఇరికించారని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. 1998లో రాజస్థాన్ లోని కంకణి సమీపంలో కృష్ణ జింకలను వేటాడారని నమోదైన కేసులో శుక్రవారం జోధ్‌పూర్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు సల్మాన్ తన వాంగ్మూలం నమోదు చేశారు. ఆ రోజు తాను భద్రతా కారణాల రీత్యా షూటింగ్ ముగిసిన తర్వాత హోటల్ గదిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. సహ నిందితులు సైఫ్ అలీఖాన్ సొనాలీ బింద్రే, టబు, నీలమ్‌లతో కలసి సల్మాన్ కోర్టుకు హాజరయ్యారు.
సల్మాన్ దాదాపు గంట సేపు కోర్టులో ఉండి మొత్తం 65 ప్రశ్నలకు సమాధానమిచ్చి, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సహ నిందితులైన మిగతా నటులు మాత్రం దాదాపు రెండున్నర గంటల సేపు ఒక్కొక్కరు 61 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సల్మాన్ తన వాంగ్మూలంలో తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తర్వాతి విచారణలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే సాక్ష్యాలు ప్రవేశపెడతానని కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా వేసింది. కేసులో సహ నిందితుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేసింది.