సీల్డ్ కవర్‌లో నల్ల కుబేరులు
సుప్రీంకోర్టుకు 627 మంది ఖాతాదారుల జాబితా
న్యూఢిల్లీ: నల్లకుబేరులందరి పేర్లూ వెల్లడించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 627 పేర్లతో కూడిన జాబితాను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు జెనీవా శాఖలో ఖాతాలు ఉన్న వారి లిస్టు ఇది. ఈ ఖాతాల్లో నిధులకు సంబంధించి పన్నులపరమైన విచారణ వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. సుప్రీం కోర్టుకు కేంద్రం అందజేసిన సీల్డ్ కవర్‌లో మూడు సెట్ల డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటిలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు, ఖాతాదారుల పేర్లు, నల్లధనం కేసుల్లో జరుగుతున్న విచారణ ఏ దశలో ఉన్నది మొదలైన వివరాలు ఉన్నాయి. అయితే, సుప్రీంకోర్టు మాత్రం సీల్డ్ కవరును తెరవలేదు. వాటిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అందజేయాలని ఆదేశించింది. సిట్ చైర్మన్ ఎంబీ షా, వైస్ చైర్మన్ అరిజిత్ పసాయత్‌లు మాత్రమే కవర్లలోని పేర్లు, వివరాలు పరిశీలిస్తారని, తీసుకోతగిన చర్యలను నిర్ణయిస్తారని పేర్కొంది. సిట్ నవంబరు ఆఖరులోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు, ఈ అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ ను తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 3న పరిశీలిస్తామని తెలిపింది.
2006 నాటి వివరాలు..
ఖాతాదారుల్లో దాదాపు సగం మంది భారత్‌లో నివసిస్తున్నవారేనని, ఆదాయ పన్ను చట్టాల ప్రకారం వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. మిగతా వారు ప్రవాస భారతీయులని వివరించింది. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ మదన్ బి. లోకుర్‌లతో కూడిన బెంచ్ ముందు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గీ వాదనలు వినిపించారు. జాబితాలో కొంతమంది ఇప్పటికే తమకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న విషయాన్ని ఒప్పుకోవడంతో పాటు పన్నులు కూడా కట్టారని ఆయన పేర్కొన్నారు. కేంద్రం సమర్పించిన ఖాతాదారుల వివరాలు 2006 నాటివని చెప్పారు. వీటిని ఫ్రాన్స్ ప్రభుత్వం 2011లో కేంద్రానికి అందజేసినట్లు వివరించారు. ఈ ఖాతాల్లో చాలా మటుకు లావాదేవీలు 1999-2000 మధ్యలో జరిగాయి. ఆదాయ పన్ను చట్టాల్లో సవరణల మేరకు ఈ లావాదేవీలపై పన్నుల మదింపునకు 2015 మార్చి 31 దాకా వ్యవధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా పన్ను ఎగవేత కేసులను తిరగతోడేందుకు ఆరేళ్ల దాకా మాత్రమే వ్యవధి ఉండేదని, చట్ట సవరణ కారణంగా నేరం జరిగిన 16 ఏళ్ల దాకా విచారణ జరిపి, చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. వాదనల అనంతరం మీడియాతో మాట్లాడుతూ . ఈ ఏడాది జూన్‌లో కూడా ప్రభుత్వం ఇదే జాబితాను సిట్‌కు సమర్పించినట్లు రోహత్‌గీ తెలిపారు. ఇతర దేశాలతో ఒప్పందాల విషయంలో ఎదురయ్యే సమస్యలను సిట్ ముందు ఉంచేందుకు న్యాయస్థానం అనుమతించినట్లు వివరించారు.
నేపథ్యమిదీ..
రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నల్లకుబేరుల అంశానికి సంబంధించి కేంద్రం ఈ నెల 27న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇందులో డాబర్ ఇండియా ప్రమోటర్లలో ఒకరైన ప్రదీప్ బర్మన్, గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో డెరైక్టర్లు, బులియన్ డీలర్ పంకజ్ చిమన్‌లాల్ లోధియా సహా ఎనిమిది పేర్లను ఇందులో వెల్లడించింది. నల్ల ధనం కేసుల్లో వీరిపై విచారణ కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. విదేశాల్లో అక్రమంగా నల్లధనం ఖాతాలున్న వారి పేర్లు వెల్లడించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అయితే, విదేశీ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాలన్నీ కూడా అక్రమమైన వని అనలేమని, తప్పు చేశారనడానికి సరైన సాక్ష్యాధారాలు ఉంటే తప్ప వారందరి పేర్లూ వెల్లడించడం సాధ్యం కాదని కేంద్రం వివరించింది. పైగా పన్నులపరంగా వివిధ దేశాలతో ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు, భవిష్యత్‌లో కుదుర్చుకోబోయే ఒప్పందాలకు దీని వల్ల ఇబ్బందులు కలగవచ్చని పేర్కొంది. కానీ నల్లకుబేరుల విషయంలో దాగుడుమూతలు ఆడకుండా అందరి పేర్లూ ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి గత తీర్పులో ఒక్క పదాన్ని కూడా మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం తాజా జాబితాను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
విదేశీ మారక నిల్వలకు బూస్ట్..
భారతీయులు స్విస్‌బ్యాంకుల్లో దాచి పెట్టిన నల్లధనాన్ని బైటికి తెచ్చిన పక్షంలోతక్షణప్రయోజనాలేమీ కనిపించకపోయినా భవిష్యత్‌లో భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు పెరిగేందుకు ఇది గణనీయంగా తోడ్పడనుంది. దీని వల్ల భవిష్యత్‌లో ఫారెక్స్ నిల్వలు 30-35 బిలియన్ డాలర్ల మేర పెరిగే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 1998-2012 మధ్య కాలంలో దాదాపు 186 బిలియన్ డాలర్ల మేర ధనం విదేశీ బ్యాంకులకు తరలిపోయి ఉంటుందన్న అంచనాలతో ఈ లెక్కలు వేసినట్లు పేర్కొంది. ఇలా తరలిపోయిన ధనంలో కనీసం సగభాగమైనా బైటికి తీయగలిగితే క్రమక్రమంగా ఫారెక్స్ నిల్వలకు 30-35 బిలియన్ డాలర్లు జత కాగలదని భావిస్తున్నట్లు బీవోఎఫ్‌ఏ-ఎంఎల్ తెలిపింది. ప్రస్తుత లెక్కల ప్రకారం మూడు నుంచి నాలుగు నెలల దిగుమతి బిల్లుకు సరిపడేంత స్థాయిలో ఈ మొత్తం ఉండగలదని పేర్కొంది.