న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న తమ ఖాతాలు న్యాయపరంగానే ఉన్నాయని డాబర్ ఇండియా స్పష్టం చేసింది. విదేశాల్లో నల్లధనం వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాబర్ సంస్థ సోమవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. 'డాబర్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ అయిన ప్రదీప్ బర్మన్ విదేశీ ఖాతాలు తెరిచి ఉంచిన పుస్తకం. ఆయన ఖాతాలు న్యాయపరంగానే ఉన్నాయి. విదేశాల్లో బ్యాంకు ఖాతాలకు సంబంధించి అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకున్నాం. ఆయన ప్రవాస భారతీయుడు(ఎన్ఆర్ఐ) కూడా అని' డాబర్ ఇండియా పేర్కొంది. ఇందుకు గాను ఆదాయపు శాఖకు ట్యాక్స్ ను కూడా చెల్లించినట్లు తెలిపింది.
విదేశాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతీ ఒక్కరినీ ఒకే తాటికి కట్టేయడం చాలా దురదృష్టం అని ఈ సందర్భంగా డాబర్ ఇండియా పేర్కొంది. 130 ఏళ్ల సుదీర్ఘమైన చరిత్ర కల్గిన డాబర్ 200 పైగా ప్రొడక్ట్స్ ను వినియోగదారులకు అందిస్తోంది. అయితే తాజాగా బ్లాక్ మనీ జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లను కేంద్రం బయటపెట్టింది. ప్రస్తుతానికి వెల్లడించిన ముగ్గురిలో మాత్రం రాజకీయ నాయకులు ఎవరూ లేరు. డాబర్ గ్రూపు డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల వ్యాపారి రాధా టింబ్లో, వ్యాపారి చమన్ లాల్.. ఈ ముగ్గురి పేర్లతో కూడిన అఫిడవిట్ను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.