న్యూఢిల్లీ : నల్లధనం అంశంపై పేరు వెల్లడి కావటంపై డాబర్ ఇండియా మాజీ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్ కుటుంబం స్పందించింది. న్యాయపరమైన అనుమతులతోనే విదేశాల్లో ఖాతా ఉన్నట్లు బర్మన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవాస భారతీయుడిగా ఉన్నప్పుడు ప్రదీప్ బర్మన్ ఖాతా తెరిచారని, విదేశీ అకౌంట్ తెరిచే సమయంలో అన్ని చట్టాలు పాటించామన్నారు.
అవసరమైన పన్నులు చెల్లించామని, విదేశీ అకౌంట్ల విషయంలో చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన ఖాతాల మధ్య సరైన వివరణ లేదని బర్మన్ కుటుంబం ఆరోపించింది. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలును పంకజ్ చమన్ లాల్ లోధ్యా ఖండించారు. విదేశాల్లో ఖాతాలు పెట్టడం నేరమా అని ఆయన ప్రశ్నించారు.
కాగా నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విదేశాల్లో నల్లధనం దాచుకున్న ముగ్గురి పేర్లను కేంద్రం ఈ సందర్భంగా బయటపెడ్డింది. డాబర్ గ్రూపు డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, గోవా గనుల వ్యాపారి రాధా టింబ్లో, శ్రీజ ట్రేడింగ్ కంపెనీ ప్రమోటర్ చమన్ లాల్ పేర్లతో కూడిన అఫిడవిట్ను సమర్పించింది.