
చిన్నమ్మ మరణం : చిన్నబోయిన బాలీవుడ్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణంపై బాలీవుడ్ దిగ్ర్భాంతి చెందింది. సుష్మా హఠాన్మరణంపై బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యావత్‌జాతిని ఆందోళనకు గురిచేసిన సుష్మా మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ఓ గొప్ప రాజనీతికలిగిన నేత, దిగ్గజ నాయకురాలు మనల్ని విడిచివెళ్లారన్న విషాద సమాచారం తమను బాధించిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచన్ సంతాపం వ్యక్తం చేశారు. సుష్మా స్వరాజ్ అద్భుత పార్లమెంటేరియన్, మంత్రి అంటూ కొనియాడిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అత్యున్నత సేవలు అందించిన ఆమెను మిస్ అవుతున్నామని అన్నారు.
సుష్మా స్వరాజ్‌జీ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అనుష్క శర్మ ట్వీట్ చేశారు. సుష్మాజీ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆమె తమకు ఎప్పటి నుంచో అత్యంత సన్నిహితురాలిగా మెలిగేవారని, తమ పట్ల ఆప్యాయత కనబరిచేవారని సంజయ్ దత్ గుర్తుచేసుకున్నారు. దిగ్గజ నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.