
అమ్మాయిల పక్కన అబ్బాయిలు కూర్చోవద్దు
చదివేస్తే ఉన్నమతి పోతుందా? 93శాతం అక్షరాస్యతతో దేశంలోనే అత్యధికంగా విద్యావంతులున్న రాష్ట్రంగా పేరున్న కేరళలో.. అందునా విద్యా శాఖ మంత్రిగా ఉంటూ అబ్దూ రబ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వింటే ముందరి ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పాలి.
ఓ వైపు లింగ వివక్షను రూపుమాపేందుకు అనేక కార్యక్రమాలు అమలవుతున్న తరుణంలో తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే బెంచ్ పై పక్కపక్కన కూర్చోవద్దని అన్నారు మంత్రి అబ్దూ రబ్. అమ్మాయి పక్కన కూర్చున్నాడని ఓ యువకుడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన ఘటనపై విద్యార్థిలోకం ఆందోళనలు నిర్వహిస్తున్న తరుణంలోనే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.
'స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే బెంచ్ పై కూర్చోవడాన్ని వ్యక్తిగతంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా. వాళ్లలా కూర్చోవటానికి వీల్లేదు. కాని ఇక్కడ మన నిర్దేశాలు పనికిరావు. ఈ విషయంలో ఆయా కాలేజీలదే తుది నిర్ణయం' అని మంత్రి అబ్దూ అన్నారు.
గత అక్టోబర్ లో కోజికోడ్ జిల్లాలోని ఫరూఖ్ కాలేజీలో తొమ్మిది మంది బీఏ విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం నోటీసులిచ్చింది. వారిలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలూ ఉన్నారు. తరగతి గదిలో ఒకే బెంచ్ పై కూర్చోవడమే వారు చేసిన తప్పు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
అయితే ఒక విద్యార్థి మాత్రం యాజమాన్యంపై తిరగబడ్డాడు. దీంతో అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. కాలేజీకి వ్యతిరేకంగా విద్యార్థి యూనియన్లు ఆందోళనలు నిర్వహించాయి. విషయం న్యాయస్థానం వరకూ వెళ్లింది. వెంటనే విద్యార్థిపై సస్పెన్షన్ వేటు ఎత్తువేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంతలోనే విద్యా మంత్రి లింగబేధాత్మక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.