అత్యాచారం చేస్తే ఉరితీస్తారా?: ములాయం
మొరాదాబాద్: అత్యాచారం చేస్తే ఉరితీస్తారా అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలు చేసి తాజాగా వివాదంలో కూరుకుపోయారు. రేపిస్టులకు అనుకూలంగా ములాయం వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో గతవారం రెండు గ్యాంగ్ రేప్ లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు మరణశిక్ష వేయడంపై ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ కేసులో మరణశిక్ష వేయడమే పరిష్కారమా? వాళ్లు యువకులు. యువకులు తప్పు చేస్తారు అంటూ మొరాదాబాద్ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని శక్తి మిల్స్ లో ఓ ఫోటో జర్నలిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్ పై జరిగిన అత్యాచారం కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు.
అమ్మాయిలకు, అబ్బాయిలకు విబేధాలు వస్తాయి. దాంతో అమ్మాయిలు వెళ్లి అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేస్తారు. పాపం యువకులు ముగ్గురికి మరణ శిక్ష వేశారని ములాయం వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేస్తే మరణశిక్షేనా అంటూ తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తే చట్టాలను మారుస్తాం. తప్పుడు కేసులు పెట్టేవారిపై కూడా శిక్షలు వేస్తామని పరోక్షంగా మహిళపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార కేసులో వేస్తున్న శిక్షలపై, విధిస్తున్న చట్టాలను ములాయం ప్రశ్నించడం కొత్త వివాదానికి దారితీసింది. తాను అధికారంలోకి వస్తే అత్యాచారం కేసులకు సంబంధించిన చట్టాలను మారుస్తానని ములాయం అన్నారు. రేపిస్టులకు ములాయం బాసటగా నిలవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పలు మహిళా సంఘాలు ఎలక్షన్ కమిషన్, జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.