
లంకపై కన్నెర్ర!
సాక్షి, చెన్నై: శ్రీలంకలో యుద్ధం పేరుతో తమిళులపై సింహళీయ సైన్యం సాగించిన మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ దేశ సర్కారు పైశాచికత్వాన్ని నిరసిస్తూ, ఈలం తమిళులకు మద్దతుగా రాష్ర్టంలో నేటికీ ఆందోళనలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శ్రీలంకలో ముస్లింలపై సింహళీయులు తమ ప్రతాపం చూపించే పనిలో పడ్డారు. రెండు రోజుల క్రితం ఆ దేశంలో ముస్లిం మైనారిటీలపై దాడులు చోటు చేసుకున్నాయి. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉండే ప్రాంతాల్లో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటనను రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.
ఆందోళనలు: పొరుగు దేశంలో ముస్లింలపై దాడులకు నిరసనగా ఇండియన్ నేషనల్ లీగ్ పార్టీ, తౌఫిక్ జమాత్ తదితర మైనారిటీ సంఘాలు ఆందోళనలకు పిలుపు నిచ్చాయి. సోమవారం ఇండియన్ నేషనల్ లీగ్ నేతృత్వంలో శ్రీలంక దౌత్య కార్యాలయ ముట్టడికి యత్నించగా, మంగళవారం తౌఫిక్ జమాత్ నేతృత్వంలో భారీ నిరసన జరిగింది. పెద్ద ఎత్తున ఆ జమాత్ ప్రతినిధులు, మహిళలు ఉదయాన్నే ర్యాలీగా లయోలా కళాశాల వద్దకు చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే చిత్రాన్ని చీపుర్లతో కొడుతూ నిరసన తెలియజేశారు. ఆ జమాత్ కార్యదర్శి కోవై రహ్మతుల్లా నేతృత్వంలో అందరూ కలసి కట్టుగా నుంగబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. మార్గం మధ్యలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు రోడ్డుపై నిరసన కారులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఆగాయి.
ఆందోళనకారులు ఆ కార్యాలయం వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేయడంతో, పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులు, నిరసన కారుల మధ్య వాగ్యుద్ధం, తోపులాట చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రత : శ్రీలంకపై మైనారిటీలు కన్నెర్ర చేసిన దృష్ట్యా, నగరంలోని దేశ దౌత్య కార్యాలయానికి, ఎగ్మూర్‌లోని బౌద్ధాలయానికి, శ్రీలంక ఎయిర్ లైన్స్, బ్యాంక్‌లకు భద్రతను పెంచారు. ఆ మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. మహ్మద్ ప్రవక్త మీద బురదజల్లుతూ అమెరికాలో తీసిన ఓ చిత్రానికి నిరసనగా ఇక్కడి ముస్లింల ఆగ్రహానికి ఆ దేశ దౌత్య కార్యాలయం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ దాడి పోలీసు అధికారుల మెడకు సైతం చుట్టుకుంది. ఈ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, గతం పునరావృతం కాకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
టీఎంఎంకే నిరసన : ముస్లింలపై దాడిని నిరసిస్తూ టీఎంఎంకే, వీసీకేల నేతృత్వంలో సాయంత్రం నుంగబాక్కంలో నిరసన జరిగింది. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత హైదర్ అలీ, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలో ర్యాలీగా నిరసన కారులు నుంగబాక్కం చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీలంక దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీలంక పైశాచికత్వ చర్యలపై తిరుమావళవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు అడ్డుకట్ట వేయాలని, పునరావృతం అయితే, మాత్రం తమిళుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని శ్రీలంక సర్కారును హెచ్చరించారు.