
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జవనరి 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ మేరకు బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌పై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. వాడీ వేడిగా సాగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. డిసెంబర్ 15న సమావేశాలు ప్రారంభంకాగా ఇరు సభలు 13 రోజులు సమావేశమయ్యాయి. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. రాజ్యసభలో మోక్షం లభించలేదు. ఇరు సభలు 12 బిల్లులకు ఆమోదం తెలిపాయని కేంద్ర మంత్రి అనంత కుమార్ చెప్పారు. బడ్జెట్ సమావేశాలు 29న ప్రారంభమవుతాయని, మొదటి రోజు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తారని చెప్పారు.
ఆరోజే ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారన్నారు. తొలి దశ సమావేశాలు 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగుతాయి. లోక్‌సభ 13 రోజుల్లో 61 గంటల 48 నిమిషాలు సమావేశమైందని స్పీకర్ మహాజన్ చెప్పారు. ‘అంతరాయాలు, వాయిదాలతో 15 గంటల సమయం వృథా అయ్యింది. సమావేశాల్లో ప్రభుత్వం 16 బిల్లుల్ని పెట్టింది’ అని స్పీకర్ తెలిపారు. రాజ్యసభలో చివరి రోజు కూడా ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎలాంటి చర్చా జరగలేదు. రాజ్యసభ మొత్తం 41 గంటలు సమావేశం కాగా.. అంతరాయాలు, వాయిదాలతో 34 గంటల సమయం వృథా అయ్యింది. ఈ నెలలో పదవీకాలం ముగుస్తున్న సీనియర్లు కరణ్ సింగ్, జనార్దన్ ద్వివేది, పర్వేజ్ హష్మిలకు రాజ్యసభ వీడ్కోలు చెప్పింది.