
పర్యావరణానికి 19% పెంపు
ఇటీవల వివాదాస్పదంగా మారిన పర్యావరణ అంశంపైనా కేంద్రం దృష్టి పెట్టింది. 2017–18 బడ్జెట్‌లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లను కేటాయించింది.
కేటాయింపులపై పెదవి విరిచిన పర్యావరణ సంస్థలు
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాస్పదంగా మారిన పర్యావరణ అంశంపైనా కేంద్రం దృష్టి పెట్టింది. 2017–18 బడ్జెట్‌లో పర్యావరణ శాఖకు రూ.2,250.34 కోట్లను కేటాయించింది. ఇది గతేడాదికన్నా సుమారు 19 శాతం ఎక్కువ. ఇక పులుల సంతతిని సంరక్షించేందుకు చేపట్టిన ‘ది ప్రాజెక్ట్ టైగర్’కార్యక్రమానికి గతేడాదికన్నా రూ.30 కోట్లు తక్కువగా రూ.345 కోట్లు కేటాయించారు. ఇక ఏనుగుల సంరక్షణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు కూడా గతేడాదికన్నా రెండున్నర కోట్లు ఎక్కువగా రూ.27.5 కోట్లు ఇచ్చారు. తాజా బడ్జెట్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు రూ.74.3 కోట్లు మాత్రమే కేటాయించారు.
దీనిపై పర్యావరణ సంస్థలు మండిపడ్డాయి. ‘‘దేశంలో పెరిగిపోతున్న కాలుష్యం సమస్యను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవు. దీనిని బట్టి ప్రభుత్వం పర్యావరణ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థమవుతోంది..’’అని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిపుణులు పేర్కొన్నారు. ఇక పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్థ్యం పెంపు వంటి లక్ష్యాలను అడ్డుకునేదిగా తాజా బడ్జెట్ ఉందని ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (టెరి) సంస్థ వ్యాఖ్యానించింది. పర్యావరణ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొంది.