
సాక్షి, ముంబై : భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగరం తడిసిముద్దైంది. వీధులన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంథేరి బ్రిడ్జి కొంతభాగం కుప్పకూలి రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. అంథేరి బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్టు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
అంథేరి బ్రిడ్జి మీదుగా రోజూ దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రయాణీకులు వివిధ రూట్లలో ప్రయాణిస్తుంటారు. కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు నీటమునగడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలో దించారు.
మరోవైపు రానున్న 24 గంటల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ కేంద్రం అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.