
మోదీ కేబినెట్లోకి కొత్త మొహాలు?
ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని రెండోసారి విస్తరించనున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని రెండోసారి విస్తరించనున్నారు. వచ్చేవారం ఆయన యూరప్, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. దాంతో విదేశీ పర్యటనకు ముందే మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేయాలని మోదీ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు శనివారం ఉదయం తెలిపారు. కేంద్ర సహాయ మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, మనోజ్ సిన్హాలను కేబినెట్ లోకి తీసుకొనున్నట్లు తెలుస్తోంది.
తన కేబినెట్ లోకి బీజేపీతో పాటు మిత్రపక్షాలు శివసేన, పీపుల్స్ డెమక్రటిక్ పార్టీల నేతలకు చోటు కల్పించాలని యోచిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ కి చోటు దక్కుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలలో కీలకమైన భూసేకరణ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా రాజ్యసభలో ఇబ్బందులు తలెత్తాయి. కాగా, రెండో విడత బడ్టెట్ సమావేశాలు యునైటెడ్ నేషనల్ డెమోక్రటిక్ కూటమిగా జరగాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.
గత డిసెంబర్ లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా 21 మంది కొత్త వాళ్లకు మంత్రివర్గంలో చోటుకల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మంత్రివర్గంలో మోదీతో సహా 27 మంది కేబినెట్, 26 మంది స్వతంత్ర, 13 మంది సహాయ హోదా మంత్రులున్నారు.