సగం జీతమే వస్తుంది.. మా గతేంటి?
దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి వాహనాల విధానం డ్రైవర్ల పొట్ట కొట్టేలా ఉంది. ఇప్పటివరకు ఈ కోణం వెలుగులోకి రాకపోయినా.. తాజాగా ఢిల్లీలో శుక్రవారం నాడు బయటకు వచ్చిన వాహనాల డ్రైవర్లను 'సాక్షి' పలకరించినప్పుడు ఈ విషయం బయటపడింది. కొత్త చట్టం కారణంగా తాము సగం రోజులు మాత్రమే కార్లు బయటకు తీయాల్సి ఉంటుందని, యజమానులు కూడా ఆ లెక్కన సగం జీతమే ఇస్తామని అంటున్నారని, తమ గతేం కానని ఓ కారు డ్రైవర్ ప్రశ్నించాడు. ఒక యజమానికి రెండు కార్లుండి, వాటిలో ఒకటి సరిసంఖ్యతోను, మరొకటి బేసి సంఖ్యతోను ముగిసేటట్లయితే కొంతవరకు పర్వాలేదు. అప్పుడు కూడా ఇద్దరు డ్రైవర్లలో ఒకరికి ఉద్వాసన తప్పదు. ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని స్వయంగా కేజ్రీవాల్ కూడా ఊహించి ఉండరు.
తొలి ఫైన్ కట్టారు..
మృదుల్ యాదవ్.. నిన్నటి వరకు ఆయన ఓ మామూలు సర్వసాధారణ ఢిల్లీ పౌరుడు. కానీ ఈ రోజు ఉన్నట్టుండి సెలబ్రిటీ అయిపోయారు. దేశ రాజధానిలో బేసి సంఖ్యతో ముగిసే నెంబర్ ఉన్న కార్లు మాత్రమే శుక్రవారం నాడు రోడ్డుమీదకు రావాలని నిబంధన ఉన్నా, సరిసంఖ్యతో ముగిసే నెంబరున్న తన కారులో బయటకు వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, అతడిని ఆపి.. రూ. 2 వేల జరిమానా విధించారు. కొత్త చట్టం అమలు అవుతున్న విషయం తనకు తెలుసని, కానీ అర్జంటుగా వెళ్లాల్సి వస్తోందని మృదుల్ అన్నారు. తన వద్ద ఉన్న కార్లన్నింటికీ సరి సంఖ్యలే చివర ఉన్నాయని, తప్పనిసరి కాబట్టి జరిమానా కట్టి వెళ్తాననని ఆయన చెప్పారు.