'సరి-బేసి' సూపర్ సక్సెస్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు తాము అమలు చేస్తున్న సరి-బేసి సంఖ్యల విధానానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ విధానాన్ని ఢిల్లీ ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించారని పేర్కొన్నారు. 'సరి-బేసి విధానానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రోడ్లపై కార్లు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ పథకం తప్పకుండా విజయవంతమవుతుంది. అయితే శాశ్వతంగా సరి-బేసి నిబంధన అమలు చేయడం కుదరదు. భవిష్యత్ లో ఢిల్లీ ...దేశానికి ఆదర్శనంగా నిలుస్తుంది' అని మీడియాతో చెప్పారు.
పెద్ద సవాళ్లను అధిగమించగలమని ఢిల్లీ ప్రజలు రుజువు చేశారని ప్రశంసించారు. దేశానికి మార్గసూచిలా నిలిచారని కితాబిచ్చారు. తన కారులో మరో నలుగురితో కలిసి తాను కార్యాలయానికి వెళ్లినట్టు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇద్దరు మంత్రులు, తన వ్యక్తిగత కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిలను కారులో ఎక్కించుకున్నానని తెలిపారు. సరి-బేసి విధానం అమలుపై సానుకూల స్పందన వ్యక్తం కావడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.