‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది? | Odd-even: Fewer cars on roads, but air in Delhi remains polluted | Sakshi
Sakshi News home page

‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది?

Published Sat, Jan 2 2016 3:21 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది?

‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది?

న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ వాహనాల నియంత్రణ విధానం బేస్ అంటూ సోషల్ మీడియా ప్రశంసించినా, ఈ విధానం తొలిరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చంకలు గుద్దుకున్నా నగరంలో కాలుష్యం శాతం ఎందుకు తగ్గలేదు.

రోడ్లపైనా కార్ల రాకపోకలను చెప్పుకోతగ్గ స్థాయిలో నియంత్రించగలిగినా, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు సెలవుదినం ప్రకటించినప్పటికీ కాలుష్యం ఏమాత్రం ఎందుకు తగ్గలేదు. వాస్తవానికి గత వారం కన్నా శుక్రవారం ఎక్కువుందని, ఆ మాటకొస్తే దీపావళి తర్వాత ఎక్కువ కాలుష్యం నగరంలో నమోదైందని నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు ఇండికేటర్లే కాకుండా, పుణెలోని ఐఐటిఎం సీనియర్ సైంటిస్ట్ గుఫ్రాన్ బేగ్ తెలిపారు. ఉదయం పూట ఎనిమిది గంటల వరకు కాలుష్యం తగ్గిందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా నార్మల్ రేంజ్‌కన్నా ఐదింతల కాలుష్యం పెరిగిందని ఆయన వివరించారు. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణం కావచ్చని ఆ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

కార్ల నియంత్రణా విధానం నుంచి మహిళలను మినహాయించడం, వారు నడిపే కార్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరి-బేసి విధానంలో ఆశించిన మేరకు కార్ల రాకపోకలను నియంత్రించలేక పోయారని, అంతకుమించి టూ వీలర్ల రాకపోకల సంఖ్య పెరగడం వల్ల కాలుష్యం తగ్గకపోగా పెరిగిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుమిత రాయ్ చౌదరి చెప్పారు. ఆయన వాదనతోని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఏకీభవిస్తున్నారు. వాస్తవానికి కార్లకన్నా ద్విచక్ర వాహనాల వల్లనే ఎక్కువ కాలుష్యం ఏర్పడుతోందని, కొన్ని కార్లను నియంత్రించడం వల్ల వారు ద్విచక్ర వాహనాలను ఆశ్రయించారని వారంటున్నారు. ఢిల్లీలో ద్విచక్ర వాహనాలు 55 లక్షలు ఉన్నాయి.

నగరంలో కాలుష్య స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేసే చార్ట్ బోర్డును సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసి మరీ ఎప్పటికప్పుడు వివరాలను మీడియాకు తెలియజేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా శుక్రవారం నగరంలో కాలుష్యం స్థాయి పెరిగిన విషయాన్ని అంగీకరించారు. మూడు, నాలుగు రెట్లు పెరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించారు.  ఐదడుగుల లోతు కాలుష్యం నీటిలో ఐదడుగుల ఎత్తు మనిషి నిలబడి కాలుష్యం హెచ్చు తగ్గుల గురించి చెప్పవచ్చని, 15 అడుగుల కాలుష్య కాసారంలో ఐదడుగుల వ్యక్తి నిలబడి ఏమీ చెప్పలేడంటూ తనకు తోచిన పోలికతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.

డిసెంబర్ నెలలో సరి సంఖ్య, బేసి సంఖ్య (ఫ్యాన్సీ నెంబర్లు మినహా)లకు డిమాండ్ బాగా పెరిగిందని ఆర్టీయే వర్గాలు తెలిపాయి. ఒక్కో నెంబర్‌కు 21వేల రూపాయల చార్జీని విధించగా ఒక్క డిసెంబర్ నెలలోనే తమ సంస్థకు 64 లక్షల రూపాయలు వసూలయ్యాయని వెల్లడించాయి. ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలోనే కార్ల అమ్మకాలు బాగా పెరిగాయని ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి.

 

సాధారంగా ఆఫర్ల కారణంగా డిసెంబర్ నెలలోనే సేల్స్ ఎక్కువ ఉంటాయని, అయితే ఈ సారి రెండో కారు కొనేందుకు వచ్చినవారు పది శాతం మంది ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలు దేనికి కొలమానం? కారు వాడకాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశం కారు వాడకందారుల్లో కనిపించడం లేదు. సరి-బేసి సంఖ్య కారులు కలిగి ఏరోజుకు ఏది అవసరమో దానిపై ప్రయాణించాలనుకుంటున్నారన్న విషయం సుస్పష్టం. అందుకని ఆప్ ప్రభుత్వం ఈ సరి-బేసి సంఖ్య విధానంపై ఎక్కువ కాలం ఆధారపడకుండా ప్రత్యామ్మాయ మార్గాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది విజ్ఞుల అభిప్రాయం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement