ఢిల్లీలో కార్ల నియంత్రణ సక్సెస్ అవుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచ కాలుష్య నగరాల్లో ఒకటైన ఢిల్లీ నగరంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ‘సరి-బేసి’ నెంబర్ కార్ల అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇది విజయవంతమవుతుందా, ఆశించిన ఫలితాలు సాధిస్తామా ? అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే. నగరంలోని ధనవంతులకు ఇప్పటికే ఒకటికి మించిన కార్లు ఉన్నాయి. ఒక రోజు సరి సంఖ్య మరో రోజు బేస్ సంఖ్య కార్లను తీసుకపోరా? రెండో కారు లేనివారు సెకండ్ హ్యాండ్ కారైనా కొనరా? సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉండేలా జాగ్రత్త పడలేరా? ఇంతవరకు కారు ప్రయాణానికి అలవాటు పడిన వారు రైలో, బస్సో ఎక్కి ప్రయాణం చేయగలరా?
ప్రపంచంలోని పలు దేశాల నగరాల్లో ఇప్పటికే ఈ వాహనాల నియంత్రణ విధానం అమలులో ఉంది. అక్కడ ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందా? ఇస్తే అందుకు కారణాలు ఏమిటీ? అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనాతోపాటు పలు యూరప్ నగరాలు, ల్యాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఈ వాహనాల నియంత్రణ విధానం అమలు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో బీజింగ్ నగరం మొదటి స్థానంలో ఉంది. అక్కడి రోడ్లపై కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత కాలుష్య నగరాల్లో అందులో మన దేశంలోనే 13 నగరాలు ఉన్నాయి. మెక్సికో సిటీ, యూరప్ నగరాల్లో ఈ నియంత్రణ విధానం సక్సెస్ అవడానికి సంబంధిత కారణాలు అనేకం ఉన్నాయి.
ఢిల్లీలో ప్రతి వెయ్యిమందికి 157 కార్లు ఉన్నాయి. సింగపూర్‌లో ప్రతి వెయ్యిమందికి 38 కార్లు, హాంకాంగ్‌లో 25 కార్లు ఉన్నాయి. దీన్నిబట్టి ఢిల్లీలో కార్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రపంచ దేశాలు ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నాయి. అందులో నిర్దేశించిన ప్రాంతాల్లోకి ఎలాంటి వాహనాలను అనుమతించక పోవడం, ఆ ప్రాంతంలోకి దారితీసే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయడం, పార్కింగ్ చార్జీలను పెంచడం, రద్దీ వేళల్లో ‘రద్దీ చార్జీలు’ విధించడం, మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయడం, సైకిల్ లేదా కాలి నడకన వెళ్లడాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. నగరాల్లో డీజిల్ కార్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి. ఒకే కుటంబానికి ఒకే కారు కొనే నియంత్రణలు కూడా కొన్ని నగరాల్లో కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రతి వాహనం కాలుష్యాన్ని కచ్చితంగా చెక్‌చేసే విధానాలను కూడా అమలు చేస్తున్నారు.
నగరంలోని మురకివాడల్లో నివసిస్తున్న నాలుగున్నర లక్షల మంది ఆక్రమిస్తున్న స్థలం మొత్తం నగరం విస్తీర్ణంలో కేవలం మూడు శాతంకాగా, కార్లు ఆక్రమిస్తున్న స్థలం పదిశాతమని ఢిల్లీలోని ‘సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ సంస్థ అంచనావేసింది. పార్కింగ్ స్లాట్లకు మొత్తంగా 23 నుంచి 27 చదరపు కిలోమీటర్ల స్థలం అవసరమని అభిప్రాయపడింది. ఇలాంటి స్థితిలో ఢిల్లీలో కార్ల రాకపోకలను తగ్గించాలంటే రైలు, బస్సు రవాణాను మెరుగుపర్చాలి. అంటే నగరంలోని ప్రతి మూలకు కనెక్టివిటీ ఉండాలి. విదేశాల్లోలాగా ‘బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ను అమలు చేయాలి. అంటే బస్సులను మాత్రమే అనుమతించే ప్రత్యేకమైన ‘స్పీడ్ ట్రాక్’లు ఉండాలి. ఇంటి ముందు రోడ్డుపై కార్ల పార్కింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు. పార్కింగ్ స్థలాన్ని చూపిస్తేనే కారు కొనేందుకు అనుమతివ్వాలి. రద్దీ చార్జీలు విధించాలి. ఆటోమొబైల్ లాబీ ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఈ నిబంధనలను అమలు చేయడం అంత సులభం కాదు. టోల్‌గేట్లకు వ్యతిరేకంగా ముంబైలో జరుగుతున్న ఆందోళన వెనక ఆటోమొబైల్ లాబీ ఉన్న విషయం తెల్సిందే.
ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కార్లను నియంత్రించడానికి ముందే ప్రజా రవాణా వ్యవస్థను ముఖ్యమంత్రి కేజ్రివాల్ మెరగుపర్చి ఉండాల్సింది. ఢిల్లీలోని మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన 4,500 బస్సుల్లో నాలుగు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇది వరకు ఆరువేల బస్సుల్లో ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా బస్సులు సంఖ్య పెరగాల్సింది తగ్గుతూ వచ్చింది.